శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జాతీయ రహదారి సీతంపేట గ్రామ సమీపంలోని తోటపల్లి కాలువ వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు సజీవ దహనమై ఉండటం కలకలం సృష్టించింది. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామానికి చెందిన మువ్వల నగేశ్ ఎచ్చెర్ల మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి. ఈ నెల 7న కళాశాలలో చేరిన అనంతరం సంక్రాంతికి ఇంటికి వెళ్లిన నగేశ్.. 21న తిరిగి కళాశాలకు చేరాడు. నాటి నుంచి కళాశాల వసతి గృహంలో ఉన్నాడు. బుధవారం సగం కాలిపోయి ఉన్న నగేశ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
అతని జేబులో లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా నగేశ్గా పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ నెల 26న (మంగళవారం) తన తమ్ముడికి ఫోన్ చేస్తే ఎవరో మాట్లాడారని.. తన తమ్మడి మృతి పక్కా హత్యేనని నగేశ్ అన్న ఆరోపించారు. నగేష్ మృతిపై కళాశాల యాజమాన్యం కానీ, పోలీసులు కానీ పూర్తి స్థాయిలో పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంఘటన స్థలాన్ని శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర, క్లూస్ టీం పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.