Bronze and Brass Statue Makers : కంచు, రాగి, ఇత్తడి విగ్రహాలు, పాత్రల తయారీకి రాష్ట్రంలోనే ఆ ప్రాంతం పెట్టింది పేరు. పూర్వీకుల నుంచి ఈ వృత్తినే వారి వారసులు పుణికిపుచ్చుకున్నారు. కానీ క్రమ క్రమంగా ఇప్పుడు వీటిని తయారు చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. కరోనాతో ఆర్డర్లు లేక కొంత మంది కళాకారులు వేరే ప్రాంతాలకు వలస పోతున్నారు. శ్రీకాకుళం జిల్లా బుడితి ఇత్తడి కళాకారుల కష్టాలపై ప్రత్యేక కథనం...
చూడచక్కని విగ్రహాలు, పాత్రలు తయారుచేస్తున్న వీరంతా శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితికి చెందిన కంచు, ఇత్తడి కళాకారులు. ఒకప్పుడు ఈ గ్రామంలో వందకు పైగా కుటుంబాలు ఈ వృత్తినే నమ్ముకొని బతికేవి. ఇప్పుడు ఆ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కేవలం 20 కుటుంబాల వారు మాత్రమే విగ్రహాలు, పాత్రలను తయారుచేస్తున్నారు. ఎన్నో కళాఖండాలు వీరి చేతిలో ప్రాణం పోసుకున్నా వీరి బతుకుల్లో మాత్రం పెద్దగా వెలుగులు లేవు. కరోనాతో ఆర్డర్లు మందగించి అరకొర సంపాదనతోనే వీరంతా నెట్టుకొస్తున్నారు.
బిందెలు, దేవతామూర్తుల విగ్రహాలు, ధ్వజ స్తంభాలు, పూల కుండీలు, గంటలు ఇలా ఎన్నింటినో చెక్కడంలో తమకు తామే సాటి అని నిరూపించుకున్న ఈ కళాకారులు క్రమంగా తమ వృత్తి అంతరించిపోతోందని బాధపడుతున్నారు. దేశ విదేశాల నుంచి ఇప్పుడిప్పుడే ఆర్డర్లు వస్తున్నా ఈ వృత్తిని స్వీకరించే వారు లేరని వాపోతున్నారు.
ప్రభుత్వం పనిముట్లు అందిస్తే మరింత కళాత్మకంగా విగ్రహాలు తయారుచేస్తామని ఇత్తడి కళాకారులు చెబుతున్నారు. కష్టాల్లో ఉన్న తమను ఇతర కళాకారుల మాదిరే పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.