శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం మండలం భద్రపురం గ్రామంలో ప్రమిదల తయారీదారుల కుటుంబాలు ఎక్కువ. వీరంతా దిగువ మధ్యతరగతి కుటుంబాల వారే. దీపావళి పండుగ సమయంలో ఇప్పటికీ మట్టి పాత్రలనే ఉపయోగిస్తారు. అవసరాలకు అనుగుణంగా ఏడాది పొడవునా మట్టిపాత్రలు, ఇతర వస్తువుల తయారీలో నిమగ్నమై ఉంటారు.
దీపావళి, కార్తీక మాసం, సంక్రాంతి వేడుకలకు మూడు నెలల ముందు నుంచే మట్టి పాత్రలు తయారు చేస్తారు. చెరువుల నుంచి సేకరించిన బంక మట్టితో రకరకాల కుండలు, కట్టె పొయ్యిలు, బొగ్గుల కుంపట్లు, వంటపాత్రలు, దీప ప్రమిదలు లాంటి రకరకాల వస్తువులు తయారు చేసి అమ్ముతుంటారు. ప్రమిదల ఆకారాలను బట్టి ధర నిర్ణయిస్తారు. బంకమట్టితో తయారు చేసిన వాటిని ఎండబెట్టి..గట్టి పడిన తరువాత గడ్డి, కర్రలతో కాలుస్తారు. అనంతరం వాటిని చక్కగా అలంకరించి విక్రయిస్తారు.