శ్రీకాకుళం జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్, గ్రావెల్ మాఫియాలపై సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరుతూ భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రవికిరణ్ ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణం పిడింగొయ్యి పంచాయతీలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సుమారు 16 ఎకరాల భూమి కుంభకోణంలో ఇరుక్కున్నట్లు ఆయన గుర్తు చేశారు.
సర్కార్ శాఖల ప్రమేయంపై..
రాజమహేంద్రవరం అర్బన్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న వందల కోట్ల భూ అక్రమాల్లో రెవెన్యూ, పోలీస్ సహా ఇతర శాఖల ప్రమేయం పట్ల నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీఐడీ దర్యాప్తుకి ఆదేశించడం పట్ల రవికిరణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్తిపాడు పరిధిలో గత కొద్ది నెలలుగా మైనింగ్, లిక్కర్, గ్రావెల్ మాఫియా ఆగడాలు మితిమీరిపోయి సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
ప్రజాధనం లూటీ..
వందల కోట్ల ప్రజాధనం సైతం దుర్వినియోగం అవుతున్నాయని ప్రజలు వాపోతున్నట్లు లేఖలో పొందుపరిచారు. ప్రత్తిపాడు మండలంలో ఒమ్మంగి గ్రామంలో పేదలకి ఇచ్చే ఇళ్ల స్థలాల పేరు మీద కోట్లాది రూపాయల గ్రావెల్ మాఫియా కొనసాగుతోందన్నారు.