Bejjipuram Village Success Story: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని బెజ్జిపురం యూత్ క్లబ్ స్వయం ఉపాధి, మహిళా సాధికారతే లక్ష్యంగా వేలాదిమంది మహిళలకు గోగునారతో రకరకాల ఉత్పత్తులు తయారు చేసేందుకు శిక్షణ ఇస్తూ వారి కాళ్లపై నిలబడేలా చేస్తోంది. ఇక్కడి ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు ఎంతోమంది మహిళలను వ్యాపారవేత్తలుగా మలుస్తోంది.
ప్రపంచం మొత్తం జపిస్తున్న ఆధునిక పర్యావరణ మంత్రం ప్లాస్టిక్ రహిత సమాజం. ఈ సూత్రాన్ని మూడు దశాబ్దాల క్రితమే ఆకళింపు చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లా బెజ్జిపురం యువకులు. మార్పు కావాలంటే మొదటి అడుగు మనమే వేయాలి. అదే అందరినీ అభివృద్ధి బాటలో నడిపిస్తుందని నమ్మడంతో పాటు బెజ్జిపురం యూత్ క్లబ్ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
సాగు కష్టాల నుంచి కుటుంబాలను గట్టెక్కించేందుకు గృహిణులకు చేయూతనివ్వాలనుకున్నారు. దానికోసం 1993లో 15 మంది మహిళలతో ఓ బృందం ఏర్పాటు చేశారు. వీరు మరో వంద మందిని చేర్చుకుని గాయత్రి యూత్ క్రాఫ్ట్ పేరుతో సంఘంగా ఏర్పడ్డారు. వీరందరికీ యూత్ క్లబ్ సభ్యులు వివిధ రకాల చేతివృత్తుల తయారీలో శిక్షణ ఇప్పించడమే కాకుండా, గడప దాటి బయటకు రాలేని మహిళల కోసం ఇంటికి ముడి సరుకులు తెచ్చి ఇవ్వడం, తయారైన ఆ వస్తువులను సేకరించి మార్కెటింగ్ చేయడం వంటి బాధ్యతలను తీసుకున్నారు.
మహిళల ఉపాధికి భరోసానిస్తున్నసెంచూరియాన్ విశ్వవిద్యాలయం
మొదట్లో సాంప్రదాయ శైలి ఊయలలు, చేతి సంచులు తయారు చేసేవారు. క్రమంగా ఆధునిక అవసరాలకు తగినట్లు ల్యాప్‌టాప్ బ్యాగ్లు, గృహోపకరణాలు, మ్యాట్లు లాంటి 80 రకాల వినూత్న ఉత్పత్తులను రూపొందిస్తూ శెభాష్ అనిపిస్తున్నారు. దిల్లీ, ముంబయి, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో జరిగే జాతీయస్థాయి ఎగ్జిబిషన్లలో పాల్గొంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. కొందరు సొంతంగా స్టోర్లను పెట్టి రాణిస్తున్నారు. తమ ఉత్పత్తులను విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.