శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.కోటిన్నర వరకు అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. వారం రోజుల పాటు సామాజిక తనిఖీ బృందాల ద్వారా విచారణ జరిపిన అనంతరం.. డ్వామా పీడీ కూర్మారావు అధ్యక్షతన జరిగిన ప్రజావేదికలో అధికారులు వివరాలను వెల్లడించారు. సంతకాలు లేకుండా బిల్లులు చెల్లింపు చేయడం, పనులకు సంబంధించిన మస్తర్లు, రికార్డులు మాయం కావడంపై పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘటనపై ఏపీవో రమణారావును డ్వామా పీడీ కూర్మారావు సస్పెండ్ చేశారు. ఏపీడీ, ఎంపీడీవో, ఉపాధి హామీ సిబ్బందికి మెమోలు జారీచేయాలని ఆదేశించారు. కొన్ని రికార్డుల్లో అధికారుల సంతకాలు లేకపోవడం,కొలతల్లో తేడా ఉండటంతో క్వాలిటీ కంట్రోల్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. ప్రధానంగా ఆకాశలఖవరం, జగన్నాథపురం, సంతబొమ్మాళి, మేఘవరం, నౌపడా పంచాయతీల్లో బినామీ మస్తర్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించగా, చనిపోయినవారి పేరునా మస్తర్లు వేసి నిధులు గోల్ మాల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు స్థానిక అధికారుల తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అసంతృప్తి వ్యక్తంచేశారు.