Palasa issue: శ్రీకాకుళం జిల్లా పలాసలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజల ఇళ్లు కూల్చడానికి రెవెన్యూ, పురపాలక అధికారులు ప్రయత్నించారు. నిన్న రాత్రి అధికారులు పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 27 వార్డు తెదేపా కౌన్సిలర్ సూర్యనారాయణ ఇల్లు కూల్చేందుకు ప్రయత్నించగా... అక్కడి ప్రజలు అధికారులకు వ్యతిరేకంగా ప్రొక్లెయిన్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో.. బాధితులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, గౌతు శిరీషని.. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Tension in Palasa: పలాస శ్రీనివాసనగర్‌లో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 27వ వార్డు పరిధిలోని ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు గురువారం సాయంత్రం పొక్లెయిన్‌తో అక్కడికి చేరుకున్నారు. చెరువు గర్భంలో ఆక్రమంగా నిర్మాణాలు జరిపారని వాటిని తొలగించేందుకు వచ్చామని పేర్కొనటంతో ఆ ప్రాంతవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని... విద్యుత్తు బిల్లు, ఇంటిపన్ను చెల్లిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు కూలగొడతామంటే తామంతా ఎక్కడికి వెళ్లాలంటూ అడ్డు తగిలారు.
అనంతరం అధికారులు పొక్లెయిన్‌తో 27వ వార్డు తెదేపా కౌన్సిలర్ జి.సూర్యనారాయణ ఇంటి వద్దకు చేరుకుని తొలగించేందుకు సిద్ధమవటంతో జనం అక్కడా బైఠాయించారు. మంత్రికి విన్నవించాక కూడా తొలగించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్షతోనే ఇళ్లు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇంతలో వైకాపా నాయకులు అక్కడకి చేరుకోవటంతో తెదేపా, వైకాపా మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బి.అశోక్ అక్కడికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు.