వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలకు లబ్ధి చేకూరే 16 పథకాలను రద్దు చేసిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైకాపా పాలనలో 158 ఎస్సీలపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో 29ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గ, 4 పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో సమావేశం నిర్వహించారు. ప్రతీ బాధిత ఎస్సీ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పోరాడుతుందని అచ్చెన్నాయుడు తెల్చిచెప్పారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎస్సీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించారని అచ్చెన్నాయుడు విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలకు ఎస్సీలను దూరం చేయటంతో పాటు 6వేల ఎకరాల అసైన్డ్ భూములు, 2500ఎకరాల లిడ్ క్యాప్ భూముల్ని స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. ఎస్సీ ఉప ప్రణాళిక అమలు కాకపోవటం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిర్వీర్యం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.