Bhavanapadu Greenfield Port Latest updates: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో నిర్మించనున్న భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ప్రాంతంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పర్యటించారు. విష్ణు చక్రం గ్రామ సమీపంలో ఈ నెల 19న పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాకు విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభ, ఇతర కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లను.. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లట్కార్, ఎస్పీ జీఆర్ రాధికతో కలిసి పరిశీలించారు. ఈ క్రమంలో నిర్వాసిత గ్రామమైన మూలపేటకు చెందిన పలువురు బాధితులు.. ఆర్ &ఆర్ ప్యాకేజీ, తమ భూములకు పరిహారం చెల్లించాకే.. భావనపాడు పోర్డుకు భూమిపూజ చేయాలని మంత్రులకు తేల్చిచెప్పారు. తరతరాలుగా వాటి మీదే ఆధారపడి జీవిస్తున్నామని వాపోయారు.
ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ''ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 19వ తారీఖున భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్ట్‌కు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి ముహుర్తం ఖరారు చేయడం జరిగింది. ఇప్పటికే పోర్ట్‌కు సంబంధించిన కాంట్రాక్టులు కూడా ఫైనల్ అయ్యాయి. దాదాపు 230 ఎకరాల పైచిలుకు భూమిని కాంట్రాక్టర్‌కు అప్పగించాం. త్వరితగతిన పోర్ట్ నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి.. ఇటు విశాఖపట్టణం పోర్ట్ తర్వాత అంతటి ప్రాముఖ్యతను భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ సంతరించుకోబోతుంది. మ్యారిటైమ్ బోర్డు ద్వారా చేపట్టనున్న నాలుగు పోర్టుల్లో మూడు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణాన్ని చేపట్టుతుంది. అందులో రామయపట్నం పోర్టు నిర్మాణంలో ఉంది. మచిలీపట్నం పోర్టుకు సంబంధించిన అన్నీ అనుమతులు కూడా పూర్తయ్యాయి. దానిని వచ్చే నెలలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. రానున్న కాలంలో భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ది చెందుతుంది'' అని ఆయన అన్నారు.