కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సమ్మెలు, నిరసనలు, ధర్నాలకు అనుమతులు ఇవ్వబోమని పాలకొండ డీఎస్పీ శ్రావణి స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారులకు నేరుగా వినతిపత్రం రూపంలో అందించవచ్చని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా సమ్మెలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహిస్తే ఉపేక్షంచేది లేదని.. సెక్షన్ 30, 188 ప్రకారం చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తేల్చిచెప్పారు.
కరోనా బారిన డిపార్ట్మెంట్ సిబ్బంది..
ఇప్పటికే వివిధ కార్యక్రమాల్లో విధులు నిర్వహించిన నలుగురు పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఆమె పేర్కొన్నారు. పాలకొండ డివిజన్ పరిధిలో తొమ్మిది మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకిందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా రెండో దశ వేగవంతంగా వ్యాప్తి చెందడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.