Andhra Pradesh Roads in Worst Condition: మంత్రి అంటే తన శాఖ మాత్రమే కాకుండా, ఆయా జిల్లాల్లో ఏ శాఖకు సంబంధించిన అంశాలపై అయినా సమీక్ష నిర్వహించవచ్చు. రోడ్లు గోతులమయంగా ఎందుకు మారాయి? వాటికి మరమ్మతులు ఎందుకు చేయలేకపోతున్నారు? విస్తరణ, పునరుద్ధరణకు ఉన్న అడ్డంకులు ఏంటి? గుత్తేదారులు పనులను ఎందుకు నిలిపివేశారు? వారి బిల్లులు ఎంతకాలం నుంచి ఆగిపోయాయి? ఇలా అన్ని అంశాలపై సమీక్ష నిర్వహిస్తే, ప్రజల కష్టాలు తీరతాయి. కానీ వారికి ఇవేమీ పట్టడం లేదు. పలు జిల్లాల్లోని మంత్రుల నివాస ప్రాంతాలు, క్యాంప్ కార్యాలయాలకు దగ్గరలో ఉన్న రహదారులను ఈటీవీ-ఈనాడు యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
ఎన్నికల హామీ ఏమైంది..?: శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం బెండిగేట్ నుంచి పూండి మీదుగా నౌపడ వెళ్లే రహదారిపైనే మంత్రి సీదిరి అప్పలరాజు తన స్వగ్రామం వజ్రపుకొత్తూరు మండలం దేవునత్తాడకు ఇదేమార్గంలో వెళ్లి వస్తుంటారు. ఎమ్మెల్యే అయ్యాక ఈ రహదారిని విస్తరించి, బాగు చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన అప్పలరాజు.. మంత్రి అయ్యాక కూడా ఆ విషయం పట్టించుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రహదారి మరమ్మతులకు టెండర్లు పిలిచినా గుత్తేదార్లు ముందుకు రావటం లేదు.
Damaged Roads in Guntur: "గుంటూరు గుంతల లోతు తెలియడం లేదు.. దేవుడిపైనే భారం వేశాం!"
నాలుగున్నరేళ్లైనా పూర్తి కాని వైనం: శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస రహదారి.. ఈ రెండు నియోజకవర్గాలకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్పీకర్ ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం రావాలంటే ఇదే రహదారిపై ప్రయాణిస్తారు. 10 కి.మీ. మేర నాలుగు వరసలుగా విస్తరించే పనులు నాలుగున్నరేళ్లుగా పూర్తి చేయలేకపోతున్నారు. కేంద్రం. 40 కోట్లు, భూసేకరణ తదితరాలకు 19కోట్లతో చేపట్టిన పనులు 40శాతమే పూర్తయ్యాయి. 12 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉండటంతో గుత్తేదారు పనులు నిలిపివేశారు.
ఉపముఖ్యమంత్రి రాజన్నదొర స్వగ్రామం.. మర్రివానివలసకు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నుంచి మక్కువ వెళ్లేమార్గంలోననే ప్రయాణించాలి. 56 కోట్లతో ఈ రోడ్డు విస్తరణకు రెండున్నరేళ్లక్రితం గుత్తేదారుకు పనులు అప్పగించారు. 4కోట్ల మేర బిల్లులు పెండింగ్ ఉండటంతో పనులు ఆపేశారు.
బిల్లులు రాక.. మధ్యలోనే పనులు..!: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నుంచి ద్రాక్షారామం మార్గం గుంతలమయమైంది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రామచంద్రపురంలోనే నివాసం ఉండగా, అక్కడి నుంచి ఇది 6 కి.మీ. దూరంలో ఉంది. ద్వారంపూడి నుంచి వేగాయమ్మపేట వరకు 25 కోట్లతో ఈ రహదారి అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనులను మధ్యలో ఆపేశారు.
అమలాపురంలో.. నల్లవంతెన, ఎర్రవంతెనకు మధ్య పంట కాలువకు ఇరువైపులా ఉన్న రోడ్ల దుస్థితి మరీ దారుణంగా ఉంది. ఇవి మంత్రి విశ్వరూప్ ఇంటి నుంచి కేవలం కిలోమీటరు దూరంలోనే ఉన్నాయి. ఈ రహదారి అభివృద్ధి పనులకు 2 కోట్ల రూపాయలతో మంత్రి శంకుస్థాపన చేసి రెండేళ్లయినా అతీగతీ లేదు.