శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస ప్రధాన రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. రోడ్డు, రైల్వే ప్రయాణాలకు అనుకూలంగా ఉండటం.. సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాల నుంచి రైళ్లలో సొంత ఊళ్లకు చేరుకుంటున్న వారితోపాటుగా.. వివిధ వాహనాల్లో స్వగ్రామాలకు చేరుకుంటున్న వారితో సందడిగా మారింది.
కొవిడ్ కారణంగా పలు రైళ్లను రద్దు చేయటంతో నడుస్తున్నకొన్ని రైళ్లలోనే తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో మామూలు రోజుల్లో కంటే రైల్వే ఆదాయం అధికమవుతోంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేస్తూ.. సమాచారం ఇస్తున్నారు. సీఐ బి.ప్రసాదరావు పర్యవేక్షణలో ఎస్ఐ ఏ.కోటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.