అసమానతలు లేని సమాజ స్థాపనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయమని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత జయంతి సందర్భంగా.. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ కూడలిలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి.. కలెక్టర్ నివాస్తో కలిసి నివాళులు అర్పించారు. ప్రపంచ చరిత్రలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం తెరిచిన పుస్తకం వంటిదన్నారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు.. సర్వమానవాళి సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు అంబేద్కర్ అని సభాపతి కొనియాడారు.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆదర్శప్రాయుడని తేదేపా నియోజకవర్గ బాధ్యుడు నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ కూడలి ఎలాన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇతర దేశాలకు ఆదర్శంగా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దడంలో అంబేద్కర్ కి ఎవరు సాటి లేరని ఆయన కొనియాడారు. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల సభపై రాళ్ల దాడిని ఈ సందర్భంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కర్ణ అప్పలనాయుడు తోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను.. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేశారు. చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆమదాలవలసలో అంబేడ్కర్ జయంతి..
ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకలు కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని దళిత సంఘం జిల్లా నాయకులు బేస్ మోహన్ రావు పిలుపునిచ్చారు. మునగవలస గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ కమిషనర్ ఎం.రవి సుధాకర్ రైతు బజార్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జనసేన నివాళులు