శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆదిత్యుని జయంత్యుత్సవం ప్రారంభం కానుంది. అంగరంగ వైభోగంగా రథసప్తమి వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాల నుంచి ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ ప్రత్యేకంగా తొలిపూజ చేస్తారు. అక్కడి నుంచి ఉదయం 8 గంటల వరకు స్వామివారి మూలవిరాట్టుకు క్షీరాభిషేకం జరగనుంది. అనంతరం సూర్యనారాయణ స్వామివారు నిజరూప దర్శనంతో భక్తులకు సాయంత్రం నాలుగున్నర వరకు దర్శనం ఇస్తారు.
అరసవల్లిలో రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం - అరసవల్లి ఆలయం వార్తలు
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. లక్ష మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకొనే వీలుందని అధికారులు అంచనా వేశారు. భక్తుల కోసం ప్రత్యేక దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంచారు.
అనంతరం పుష్పాలంకరణ సేవ, సర్వదర్శనం కల్పిస్తారు. స్వామివారికి పవలింపు సేవతో ఉత్సవం ముగుస్తుంది. లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొనే వీలుందని అధికారులు అంచనా వేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలు నుంచి భక్తులు వస్తారు. భక్తుల కోసం క్యూలైన్‌లో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. క్షీరాభిషేకం కోసం అందుబాటులో ఉంచిన టిక్కెట్లను కూడా క్యూలైన్‌లో ఇవ్వనున్నారు. సర్వదర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు.