రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయని..,మిల్లర్లు, ఉద్యోగులు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణా రెడ్డి హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన టెక్కలి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, రైస్‌మిల్లర్లు, రైతులతో సమీక్ష నిర్వహించారు. రైస్ మిల్లర్లు మద్దతు ధర ఇవ్వడం లేదని, బస్తాకు అదనంగా ఐదు కిలోలు తీసుకుంటున్నారని రైతులు కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పంట వేసినప్పటి నుంచి అమ్మేవరకు అన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై అంబటి కృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా వ్యాపారులు, అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం సంచులు ఇవ్వకపోవడం, బస్తాకు రూ. 100 వసూలు చేశారన్న ఫిర్యాదులు ఇప్పటికే తన దృష్టికి వచ్చాయన్నారు. ధాన్యం కోనుగోళ్ల అవకతవకలపై అవసరమైతే విజిలెన్స్ శాఖను రంగంలోకి దించి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ఉద్యోగులను సస్పెండ్ చేసేందుకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు.