Film actor Sarath Babu Biography: సినీ నటుడు శరత్ బాబు( సత్యనారాయణ దీక్షిత్) హైదరాబాదులో ప్రైవేట్ హాస్పిటల్లో ఈ రోజు మధ్యాహ్నం మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు రెండు నెలలుగా అనారోగ్యంతో ఉండటంలో మొదట బెంగుళూరు ఆ తర్వాత హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్న శరత్ బాబు మృత్యువుతో పోరాడి చివరకు సోమవారం మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మృతి చెందారు.
ఆమదాలవలసలో విషాదఛాయలు..శరత్ బాబు మృతి చెందడంతో ఆయన స్వగ్రామమైన ఆమదాలవలసలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన స్నేహితులు, సన్నిహితులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. చిన్నతనంలో వారు చేసిన పనులు, నాటకాలను గుర్తు చేసుకుంటూ.. బాధ పడ్డారు ఆయనకు నాటకాల వల్లే ఎంతో పేరు వచ్చిందని ఆయన స్నేహితులు తెలిపారు. అత్యంత సన్నిహితంగా ఉండే తమ మిత్రుడు ఇలా అకస్మికంగా మృతి చెందడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
శరత్ బాబు కుటుంబం వివరాలు.. శరత్ బాబు కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి ఆమదాలవలసకు 1950 ప్రాంతంలో తరలివచ్చింది. శరత్ బాబు తండ్రి బిజియ శంకర్ దీక్షిత్, తల్లి సుశీల వీరికి 13 మంది సంతానం. అందులో సత్యనారాయణ దీక్షిత్ (శరత్ బాబు) మూడో కుమారుడు. శరత్ బాబు పెద్దన్నయ్య ఉమా బాబు దీక్షితులు, రెండో అన్నయ్య రామారమణ దీక్షితులు, శరత్ బాబు తమ్ముళ్లు సంతోష్ దీక్షిత్, గోవింద దీక్షిత్, గోపాల్ దీక్షిత్, మధు దీక్షిత్, మంజు దీక్షితులు ఉన్నారు. శరత్ బాబుకు అక్కా చెల్లెలు ఐదుగురు రమ, ఆశ, అనిత, సరిత, శ్రీదేవి ఉన్నారు.