మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అనిశా అధికారులు అరెస్ట్ చేసి ముప్పై రోజులు దాటిందని.. దర్యాప్తు అధికారుల సాక్ష్యాల సేకరణ పూర్తయిన నేపథ్యంలో బెయిలు మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా హైకోర్టులో వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతోనే తన క్లయింటును కేసులో ఇరికించారన్నారు. మూడో నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉందన్న కారణం చూపుతూ పిటిషనర్ కు బెయిల్ ఇవ్వకూడదని అనిశా చెప్పడం సరికాదన్నారు.
అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేసేందుకు, విచారణ జరిపేందుకు అవినీతి నిరోధక చట్టం ప్రకారం అధికారులు అనుమతి తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనుమతి తీసుకోకుండా నమోదు చేసిన కేసు చెల్లుబాటు కాదన్నారు. తన వాదనలకు బలం చేకూర్చే సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించాలని కోరారు. సంబంధిత తీర్పు ప్రతులు న్యాయమూర్తి ముందుకు చేరని కారణంగా.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్.. విచారణను గురువారానికి వాయిదా వేశారు.