శ్రీకాకుళం జిల్లా హిరమండలం చోర్లంగి గ్రామానికి చెందిన కరణం శ్రావణికి జగనన్న విద్యా దీవెన పథకం అందలేదు. హిరమండలం ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఈమె విద్యా దీవెన పథకం అందకపోవడంతో కార్యాలయంలో సంప్రదించగా... తన పేరుమీద 13కార్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమకు కార్లు లేవని పథకాన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు.
పేద కుటుంబానికి 13కార్లు.. వేల ఎకరాల్లో భూములట! - latest news of ap state govt schemes issues
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు వినటానికి చాలా బాగున్నాయి. కానీ అవి నిరుపేదలకు చేరాలంటే అదృష్టం ఉండాలి. తినడానికి మెతుకు లేనివారికి సైతం ప్రభుత్వ రికార్డుల్లో వేల ఎకరాల భూములు, పదుల సంఖ్యలో వాహనాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ తప్పు అధికారులదా? ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులదా అనే అయోమయం నెలకొంది.
![పేద కుటుంబానికి 13కార్లు.. వేల ఎకరాల్లో భూములట! a family not geting ammavodi and jagananna vidhyadevena even having eligibility](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6244296-1017-6244296-1582976170095.jpg)
అందని 'అమ్మఒడి'
శ్రావణి తమ్ముడు తేజేశ్వరరావు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ విద్యార్థికి అమ్మ ఒడి పథకం వర్తింపు చేయాల్సి ఉండగా.. విద్యార్థి పేరుతో 1500 ఎకరాల పంట పొలాలు ఉన్నట్లు అధికారులు దస్త్రాల్లో చూపించారు. దీంతో అమ్మఒడి పథకం కూడా వర్తింప చేయలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
తండ్రి మరణంతో బతుకు భారం..
శ్రావణి తండ్రి మోహన్ రావు మరణించిన అనంతరం తల్లి శారద కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. భారంగా బతుకుతున్న తమకు ఈ పథకాలు కాస్తాయినా ఊరట కలిగిస్తాయనుకుంటే లేని ఆస్తులు తమ పేరు మీద ఉన్నట్లు చూపి పథకాలు ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి తమకు జగనన్న విద్యా దీవెన, అమ్మ ఒడి పథకాలను వర్తింపజేయాలని శ్రావణి కోరుతున్నారు.