YCP leaders sold spare parts of vehicles:ధనార్జనకు కాదేదీ అనర్హం అని వైసీపీ నాయకులు నిరూపిస్తున్నారు. అక్రమ మార్గాల్లో జేబులు నిండే ఏ అవకాశాన్నీ వదలడం లేదు. భూ కబ్జాలు, మద్యం, ఇసుక దందాలతో డబ్బులు దండుకుంటున్న నేతలు... వాటితో సంతృప్తి చెందడం లేదు. కాసుల కక్కుర్తితో కొందరు వైసీపీ నాయకులు... ఓ సంస్థ వాహనాల విడిభాగాలను తుక్కు కింద మార్చి విక్రయిస్తున్న దందా శ్రీసత్యసాయి జిల్లాలో వెలుగుచూసింది.
విడి భాగాలుగా కట్ చేసి తుక్కుగా మార్చి రాత్రికి రాత్రే తరలింపు హంద్రీనీవా ప్రధాన కాలువ పనులను హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ చేపట్టింది. 2017లోనే కాలువ పనులు పూర్తయ్యాయి. రుణభారంతో కంపెనీ దివాలా తీయడంతో రుణదాతలు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. వ్యవహారం ఎన్సీఎల్టీకి వెళ్లడంతో దివాలా ప్రక్రియను మొదలుపెట్టారు. దాంతో కంపెనీకి చెందిన ఆస్తులు, వాహనాలను జప్తు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాలువ పనులు చేసిన ప్రాంతాల్లోని వాహనాలు, సామగ్రి యథావిధిగా అక్కడే ఉంచేశారు. బుక్కపట్నం, తలుపుల, రాయచోటి ప్రాంతాల్లోని కంపెనీ వాహనాలపై కొందరు వైసీపీ నాయకుల కన్ను పడింది. గుట్టుచప్పుడు కాకుండా వాటి విడి భాగాలు కట్ చేసి తుక్కుగా మార్చేశారు. రాత్రికిరాత్రి తుక్కును ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. ఓ కీలక నాయకుడు, మరో ప్రజాప్రతినిధి భర్త కనుసన్నల్లోనే ఈ తతంగం జరిగినట్లు తెలుస్తోంది.
శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం పరిధిలోని వాహనాలను 80 శాతం విక్రయించిన తర్వాత విషయం సంస్థ ప్రతినిధుల దృష్టికి వెళ్లింది. వెంటనే బుక్కపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా... రంగంలోకి దిగిన పోలీసులు తుక్కును తరలిస్తున్న లారీని ముదిగుబ్బ సమీపంలో పట్టుకున్నారు. తుక్కును తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచారు. అప్రమత్తమైన కంపెనీ ప్రతినిధులు మిగతా ప్రాంతాల్లోని వాహనాలను పరిశీలించగా... తలుపుల, రాయచోటి ప్రాంతాల్లో కూడా వాహనాలను తుక్కుగా మార్చి విక్రయించినట్లు తెలిసింది.
బుక్కపట్నం, తలుపుల మండలాలతో పాటు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోనూ ఈ తరహా చోరీ జరిగినట్లు సంస్థ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే నిందితులు వైసీపీ నాయకులు కావడంతో కేసులు నమోదు చేయడానికి పోలీసులు వెనకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క బుక్కపట్నం పోలీసులు మాత్రమే తమ ఫిర్యాదుపై స్పందించారని... తలుపుల, రాయచోటి పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదని చెబుతున్నారు. ఈ విషయంపై ఆయా జిల్లాల ఎస్పీలకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మూడు ప్రాంతాల్లో కలిపి చోరీకి గురైన వాహనాల విలువ సుమారు 3 కోట్లు ఉండవచ్చని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. పోలీసులు వెంటనే చర్యలు చెపట్టాలని సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: