YCP Leaders fight among Themselves: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం అధికార వైఎస్సార్ పార్టీలో వర్గపోరు మరో మారు పోలీస్ స్టేషన్కు చేరింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ హిందూపురం పట్టణంలో 'మా నమ్మకం నువ్వే జగన్' అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని అసమ్మతి కౌన్సిలర్లు అడ్డుకుంటారనే అనుమానంతో.. ఎమ్మెల్సీ రెండో వార్డు కౌన్సిలర్ రామచంద్రను ఉన్నపలంగా పోలీస్ స్టేషన్కు రావాలంటూ అతడి ఇంటి వద్దకు పోలీసులు వెళ్లారు. దీంతో విస్మయానికి గురైన అతడు అల్పాహారం చేసి వస్తానని పోలీసులతో చెప్పాడు. అయినా, పోలీసులు తన ఇంటి వద్ద మకాం వేశారని కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తాను పోలీస్ స్టేషన్కు ఎందుకు రావాలని రామచంద్ర పోలీసులను ప్రశ్నించాడు. దీంతో తమ వార్డులో జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వస్తున్న నేపథ్యంలో మీరు స్టేషన్ వద్దకు రావాలని పోలీసులు రామచంద్రకు తెలిపారు. అసహనానికి లోనైన కౌన్సిలర్ రామచంద్ర.. ఈ విషయాన్ని తోటి అసమ్మతి కౌన్సిలర్లకు తెలిపాడు. దీంతో వైస్ ఛైర్మన్ బలరాం రెడ్డితో పాటు 12 మంది వైసీపీ కౌన్సిలర్లు హుటాహుటిన హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.