YCP Mob Attacked and Killed TDP Worker: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎర్ర రామయ్యను వైసీపీ వర్గీయులు మూక దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. స్థానిక వైసీపీ నేత చౌక ధాన్యపు డీలర్ చిన్న కాశప్ప.. ప్రవీణ్ అనే యువకుడికి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో ప్రవీణ్ మామ ఎర్ర రామయ్య సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. దీంతో కాశప్ప, అతని వర్గీయులు రామయ్యపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రామయ్య అనంతపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బత్తలపల్లిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి..మరోవైపు.. కడప జిల్లాలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనంలో వెళ్లిన వ్యక్తులు తిరిగి ఇంటికి వస్తారో రారో అనే భయం నెలకొంది. ఈ నెలలో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో పదిమంది మృత్యువాత పడ్డారు. ఇందులో ఏడుగురు యువకులే ఉండడం బాధాకరం. తాజాగా ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారిద్దరూ మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తారు. ఎక్కడికి తిరిగినా కలిసే తిరుగుతారు. చివరికి మృత్యుఒడిలోకి కూడా కలిసే వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో యువకులు మరణించటంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.