సత్యసాయి జిల్లా వైసీపీలో విభేదాలు YCP activists turned against MLA: వైసీపీ బలోపేతం కోసం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మత్రి ముందే వైసీపీ నేతలు, కార్యకర్తలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ సమీక్షకు హాజరైన మంత్రి పెద్దిరెడ్డికి స్వాగతం పలికిన నాయకులు.. ఆయన ముందే ఎమ్మెల్యే తిప్పేస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "తిప్పేస్వామి వద్దు - జగనన్న ముద్దు" అంటూ నినాదాలతో హోరెత్తించారు.
వైసీపీ కార్యకర్తలకు నచ్చజెప్పేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. కార్యకర్తలు అలా చేస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మంత్రి వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నేతలు, కార్యకర్తలు వినకపోవడంతో వారిని వారించలేక మంత్రి అక్కడినుంచి వెళ్లిపోయారు. గత కొంత కాలంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే పని తీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. మంత్రి ముందే ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి:మడకశిరలోనియాదవ కళ్యాణ మండపంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తన ప్రసంగంలో గాలిపటం కథతో తన ఆవేదనను పెద్దిరెడ్డి ముందు వ్యక్తపరిచారు.
'ఆకాశంలో గాలిపటం ఎగురుతూ అందరికీ కనబడుతుంటుంది. ఎగిరేందుకు కారణమైన దారం కనబడదు. అలానే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు, వారు గెలవడానికి గాలిపటంలో దారంలా మనలాంటి కార్యకర్తలే. ప్రస్తుతం పార్టీలో ఏ సీనియర్ నాయకుడు కనబడని పరిస్థితి ఏర్పడింది యోగ్యులు, నిస్వార్థపరులను ఎంపిక చేస్తే.. తప్పకుండా రాష్ట్రంలోన 175 స్థానాలు గెలుస్తాం' - మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే..: ఎవరూ అపోహలు సృష్టించవద్దని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. శాసనసభ్యుడి మీద బురద చల్లితే.. అది మన మీదే పడుతుందని అసమ్మతి నేతలను ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను నియమించే అధికారం జగన్మోహన్ రెడ్డిదేనని స్పష్టం చేశారు.
హిందూపురం వైసీపీ వర్గపోరు: హిందూపురం వైసీపీలో సైతం వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. హిందూపురం వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ను మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయం అంటూ వెల్లడించారు. దాంతో ఇక్బాల్ వ్యతిరేక వైసీపీ శ్రేణులు ఇక్బాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సభలో గొడవకు దిగారు. సహనం కోల్పోయిన మంత్రి పెద్దిరెడ్డి.. చిల్లర రాజకీయం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన హిందూపురం మండలం ఎంపీపీ ఎస్సీ మహిళ నాగరత్నమ్మ స్టేజిపై కుర్చీలు లేకపోవడంతో కింద కూర్చున్నారు. వెంటనే తేరుకున్న నాయకులు ఆమెకు స్టేజీపై స్థానం కల్పించి కూర్చోబెట్టారు.
ఇవీ చదవండి: