YCP Attack on BJP leaders at Dharavaram: సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో భాజపా నాయకులపై వైకాపా కార్యకర్తలు కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించేందుకు సన్నద్ధమవుతుండగా మూడు వాహనాల్లో 30 మందికి పైగా వైకాపా కార్యకర్తలు కర్రలతో వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భాజపా పట్టణ అధ్యక్షుడు రాజు, కార్యదర్శి రాముతోపాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం వారిని అనంతపురం తరలించారు.
భాజపా నేతలపై వైకాపా శ్రేణుల మూకదాడి.. ధర్మవరంలో ధర్నా - సత్యసాయి జిల్లాలో భాజపా నేతలపై దాడి
YCP Activists Attack on BJP Leaders: సత్యసాయి జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు పురుడుపోసుకుంటున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లకే ఇన్నాళ్లు పరిమితమైన నేతలు.. తాజాగా భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ధర్మవరం నడిబొడ్డున సమావేశం జరుగుతుండగా వైకాపా కార్యకర్తలు కర్రలతో మూకుమ్మడిగా వచ్చి భాజపా నేతలపై దాడికి పాల్పడ్డారు. దాడిని నిరసిస్తూ ధర్మవరంలో డీఎస్పీ కార్యాలయం వద్ద భాజపా నేత గోనుగుంట్ల సూర్యనారాయణ ధర్నాకు దిగారు.
సోమవారం జరిగిన వైకాపా విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. భాజపా నేత గోనుగుంట్ల సూర్యనారాయణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించేందుకు భాజపా నేతలు మీడియా సమావేశం నిర్వహిస్తుండగానే వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. భాజపా శ్రేణులపై దాడిని నిరసిస్తూ ధర్మవరంలో డీఎస్పీ కార్యాలయం వద్ద భాజపా నేత గోనుగుంట్ల సూర్యనారాయణ ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకే దాడి జరిగిందని నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గాయపడినవారిని ఆయన పరామర్శించారు. వైకాపా నేతల దాడి నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి:తల నరికి యువకుడి హత్య.. నుపుర్ శర్మకు మద్దతు తెలపడమే కారణం.. మోదీకి వార్నింగ్