ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్తను హత్య చేసిన భార్య, కుమార్తె.. కోడలిని హత్య చేసిన అత్త - andhra pradesh crime news

Crimes and Deaths in AP: రాష్ట్రంలో పలు చోట్ల.. వివిధ ఘటనలలో పలువురు మృతి చెందారు. శ్రీ సత్యసాయి జిల్లాలో హనుమంతప్ప అనే వ్యక్తిని భార్య, కుమార్తె కలిసి హత్య చేశారు. అదే విధంగా మద్యం మత్తులో కోడలిని.. అత్త హత్య చేసిన ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో సుమారు 60 ఏళ్ల వృద్ధురాలు అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది.

crimes
నేరాలు

By

Published : Mar 10, 2023, 12:14 PM IST

Crimes and Deaths in AP: రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రదేశాలలో రెండు హత్యలు జరిగాయి. ఓ చోట కట్టుకున్న భర్తను.. భార్య, కుమార్తె కలిసి హత్య చేశారు. మరో చోట ఆవేశంలో ఉన్న ఓ అత్త కోడలిపై దాడి చేయడంతో.. కోడలు ప్రాణాలు విడిచింది. అదే విధంగా.. మరో ప్రాంతంలో జరిగిన తిరునాళ్లలో ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.. దీనిపై కేసు నమోదు చేసి.. పోలీసులు విచారణ చేస్తున్నారు.

భర్తను హత్య చేసిన భార్య, కూతురు:శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం కల్లుమరి గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. రెండు రోజుల క్రితం హనుమంతప్ప అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టగా మృతుని భార్య, కుమార్తే నిందితులుగా తేలడంతో వారిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లుమరి గ్రామానికి చెందిన హనుమంతప్ప, అక్కమ్మ దంపతులకు అనిత, సంధ్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనితకు హిందూపురం కరికెర గ్రామానికి చెందిన సురేష్​కు ఇచ్చి పది సంవత్సరాల క్రితం వివాహం చేశారు. ఆస్తులు సంపాదించినా ఇప్పటివరకూ వారికి సంతానం కలగలేదు. ఆస్తిని దక్కించుకొనే యత్నంలో చెల్లెలైన సంధ్యారాణితో సురేష్​కు రెండో వివాహం చేయాలని సురేష్ భార్య అనిత, ఆమె తల్లి అక్కమ్మ నిశ్చయించుకున్నారు.

ఈ విషయాన్ని హనుమంతప్పకు, సంధ్యారాణికి తెలపగా వారు నిరాకరించారు. హనుమంతప్ప తన రెండో కుమార్తె సంధ్యారాణిని 12 రోజుల క్రితం మరో యువకుడితో వివాహం జరిపించాడు. ఇది జీర్ణించుకోలేక హనుమంతప్పను అతని భార్య అక్కమ్మ, పెద్ద కూతురు అనిత.. పశువుల కొట్టంలో ఈనెల 7న రాత్రి 11 గంటల సమయంలో కళ్లల్లో కారం చల్లి.. అతనిపై విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో కోడలిని చంపిన అత్త: అత్త చేతిలో కోడలు హత్య అయిన ఘటన మన్యంలో సంచలనం అయింది. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలో గల జర్రెల పంచాయతీ చేలుంపుట్ గ్రామానికి చెందిన కోడా బృందా (43) తన అత్త చేతిలో హత్యకు గురైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోడా బృంద అత్త అయిన దుహర్ణీకి మద్యం తాగే అలవాటు ఉంది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో మద్యం మత్తులో వచ్చిన అత్త.. కోడలితో గొడవపడింది. ఈ సమయంలో తన వద్ద ఉన్న కత్తితో అత్త దాడి చేసింది. ఈ ఘటనలో గాయపడిన కోడలు బృందాను ముంచంగిపుట్టు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గురువారం ఉదయం మృతురాలు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీస్​లు కేసు నమోదు చేసి కోడలిని హత్య చేసిన అత్త దుహర్ణీని అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన బృందాకి ఆరుగురు పిల్లలు.

తిరునాళ్లలో మృతదేహం:ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట.. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో అపశృతి చోటుచేసుకుంది. సుమారు 60 ఏళ్ల వృద్ధురాలు అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. తిరునాళ్ల సందర్భంగా మునేరులో ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాల వద్ద వృద్ధురాలి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు, దేవస్థానం అధికారులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details