Lokesh Interaction at Yuvagalam Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 46వ రోజు శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో కొనసాగుతోంది. చీకటి మానిపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్రలో భాగంగా గంగసానిపల్లి వద్ద టమోటా రైతులతో నారా లోకేశ్ మాట్లాడారు ఎక్కువ మంది రైతులు సాగుచేసే టమోటా పంటకు గిట్టుబాటు ధర లభించాలంటే ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని రైతుల అభిప్రాయపడ్డారు. సానుకూలంగా స్పందించిన నారా లోకేశ్ పరిశీలించి ప్రభుత్వం రాగానే తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వేల సంఖ్యలో ప్రజలు: బిసనవారిపల్లి వద్ద బలిజ సామాజిక వర్గానికి చెందిన వారితో నారా లోకేశ్ మాట్లాడారు. బలిజలను బీసీల జాబితాలో చేర్చే అంశంతో పాటు ఈ డబ్ల్యుఎస్ కోటాకు సంబంధించిన సమస్యను బలిజలు లోకేశ్‌కి వివరించారు. కొక్కంటి క్రాస్‌కు యువగళం పాదయాత్ర చేరుకోగానే లోకేశ్‌ను చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అందరికీ అభివాదం తెలియజేస్తూ.. మహిళలను పలకరిస్తూ పాదయాత్ర కొనసాగింది.
సమస్యలను సావధానంగా విని: కొక్కంటి క్రాస్ సమీపంలో ఎస్టీలతో ముఖాముఖి నిర్వహించిన నారా లోకేశ్ వారి సమస్యలను సావధానంగా విన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో తండాల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎస్టీలను వంచించిన విధానాన్ని తెలియజేశారు. ఎస్టీల భూములు అన్యాక్రాంతమవుతున్న విషయాన్ని లోకేశ్ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు.