తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభను ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీనికి దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయి విజయన్, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లను ఆహ్వానించారు. కేజ్రీవాల్, భగవంత్‌మాన్, అఖిలేష్‌లు అంగీకారం తెలపగా.. కేరళ సీఎం తమ నిర్ణయాన్ని సోమవారం వెల్లడించనున్నారు.
CM KCR districts tour : పాలనా సౌలభ్యం కోసం అన్ని కార్యాలయాలు ఒకే చోట కొలువుదీరిన ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం కొత్త సమీకృత కలెక్టరేట్లు ప్రారంభానికి ముస్తాబయ్యాయి. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అధునాతన వసతులు, ఆధునిక హంగులతో తయారైన కలెక్టరేట్లను 12న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
తొలుత మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కొత్తగూడెం చేరుకుంటారు. అనంతరం కొత్త కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం ప్రారంభిస్తారు. కొత్త ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్‌ను కూర్చొబెట్టి జిల్లా పాలనకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు బీఆర్ఎస్ జిల్లా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. వైద్య కళాశాల, ఫార్మసీ కళాశాలను సందర్శించనున్నారు. ఈనెల 18న ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో తలమునకలైంది.
కొత్తగూడెం జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కొత్తగూడెం-పాల్వంచ జాతీయ రహదారి పక్కనే కొలువుదీరిన కలెక్టరేట్ ఆధునిక హంగులతో కొలువుదీరింది. మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో 45 కోట్లతో నిర్మించారు. 2018లో మొదలైన నిర్మాణం.. జీ ప్లస్ టూ పద్దతిలో 46 ప్రభుత్వ శాఖలు పనిచేసేందుకు అనువుగా రూపొందించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే ప్రత్యేక హెలీప్యాడ్ నిర్మించారు.