ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ భర్తీ : నారా లోకేశ్​

Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం పుట్టపర్తి నియోజకవర్గంలో కొనసాగింది. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను లోకేశ్​కు వివరించారు. స్పందించిన లోకేశ్​ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

nara lokesh
నారా లోకేశ్​

By

Published : Mar 26, 2023, 10:55 PM IST

51వ రోజు పుట్టపర్తి నియోజకవర్గంలో లోకేశ్‌ యువగళం పాదయాత్ర

Nara Lokesh Yuvagalam Padayatra : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులందరికీ న్యాయం చేస్తానని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర ఆదివారం కొనసాగింది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ.. యాత్రలో పాల్గొని యువనేతకు సంఘీభావం తెలిపారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది.. పుట్టపర్తి నియోజకవర్గంలోని రామయ్యపేట నుంచి ప్రారంభమైన పాదయాత్రలో భారీ సంఖ్యలో స్థానికులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ.. యాత్రలో పాల్గొని యువనేతకు సంఘీభావం తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి లాక్కున్న క్వారీలన్నీ బాధితులకు తిరిగి ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని లోకేశ్‌ హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు అంటే అందరికీ భయమని లోకేశ్​ చెప్పుకొచ్చారు. ఎందుకంటే తప్పు చేసిన వారు సొంత కుటుంబ సభ్యులైనా, సొంత పార్టీ వారైనా, కార్యకర్తలైనా ఆయన వదిలిపెట్టారన్నారు. గత నాలుగు సంవత్సరాలలో 900 మంది మహిళలపై అత్యాచారాలు జరిగియాని.. 52వేల మంది స్త్రీలు దాడులకు గురైనట్లు కేంద్రం నివేదికలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. బలంగా ఉన్న నిర్భయ చట్టాన్ని తొలగించారని విమర్శించారు.

"దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు మిమ్మల్ని గుర్తించి.. మీకు క్వారీలను అప్పగించారు. తరతరాలుగా మీరు అనుభవించుకుంటూ వస్తున్నారు. పాపాల పెద్దిరెడ్డి గనుల శాఖ మంత్రి అయిన తర్వాత మీ గనులను లాగేసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల్లో మీ క్వారీలను మీకు తిరిగి ఇప్పించే బాధ్యత ఈ లోకేశ్​ తీసుకుంటాడని హామీ ఇస్తున్నాను." -లోకేశ్​, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని.. నిరుద్యోగులకు లోకేశ్‌ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర నష్టం చేసిందన్నారు. దిశా చట్టం పేరుతో మహిళల్ని మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. రైతుల పంట‌కి మ‌ద్దతు ధ‌ర ఇవ్వలేని జ‌గ‌న్ రెడ్డి, వైసీపీకి చెందిన వాళ్లు పండించే గంజాయికి మ‌ద్దతు ధ‌ర ఇస్తున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీ వైసీపీకి సంబంధం ఉన్న వారే.. విరివిరిగా గంజాయి సాగు చేస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యం కొన‌క‌పోయినా, పాల‌కుల ద‌య‌ వ‌ల్ల గంజాయి కొనుగోలు మాత్రం ఎక్కడా ఆగ‌డం లేదని విమర్శించారు.

లిక్కర్ త‌యారీ, ర‌వాణా, అమ్మకం అన్నీ జే సిండికేట్ చేప‌ట్టిన‌ట్టే.. గంజాయి సాగు, ర‌వాణా, అమ్మకంతా వైసీపీ క‌నుస‌న్నల్లోనే సాగుతోందని ధ్వజమెత్తారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల్లోకి గంజాయి సాగుని తీసుకొచ్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత‌లు పంట‌ పొలాల్లోనే గంజాయి సాగుకి బ‌రితెగించేశారని ఎద్దెవా చేశారు.

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ రోజు 14 కిలోమీటర్లు కొనసాగింది. పాదయాత్ర 52వ రోజు సోమవారం కొండాపురం పంచాయితీ రెడ్డిచెరువుకట్ట విడిది కేంద్రం నుంచి ప్రారంభించనున్నారు. రెడ్డిచెరువుకట్ట వద్ద స్థానికులతో మాటామంతీ నిర్వహించనున్నారు. అనంతరం చలమయ్యగారిపల్లిలో వడ్డెర సామాజిక వర్గీయులతో భేటీ కానున్నారు. జీనబండ్లపల్లిలో నాయీ బ్రాహ్మణులతో సమావేశమవ్వనున్నారు. భోజన విరామం అనంతరం తిప్పరాజుపల్లి నుంచి పాదయాత్ర కొనసాగించనున్న లోకేశ్​..., గోరంట్లలో స్థానికులతో భేటీ కానున్నారు. గోరంట్ల ఆర్టీసీ సర్కిల్ వద్ద స్థానికులను కలిసి మాటామంతీ చేపట్టనున్నారు. గుమ్మయ్యగారిపల్లి వద్ద బహిరంగసభ నిర్వహించనున్నారు. గుమ్మయ్యగారిపల్లి విడిది కేంద్రంలో బస చేయనున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details