Lokesh Fires MLA Kethireddy : రాష్ట్రంలో రాజకీయం రోజుకో మలుపుతిరుగుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇవి మరీ అధికమయ్యాయి. మొన్న నెల్లూరు జిల్లా ఉదయగిరి, ఆ తర్వాత సత్యసాయి జిల్లా పుట్టపర్తి, నిన్న పల్నాడు జిల్లా పెదకూరపాడు.. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాళ్లు విసురుకున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాలతో ప్రతి క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేస్తున్న అక్రమాల గురించి తెలుసుకున్నాక.. ఆయన నెంబర్ వన్ అవినీతిపరుడనే విషయం అర్థమైందని లోకేశ్ ఆరోపించారు. ఆయన "గుడ్ మార్నింగ్ ధర్మవరం" పేరుతో పట్టణంలో తిరిగి ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయా? అని తెలుసుకుని తర్వాత వాటిని కబ్జా చేస్తారని విమర్శించారు. ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఆక్రమించి విలాసవంతమైన ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని లోకేశ్ ఆరోపించారు. రైతులకు రెవెన్యూ అధికారుల ద్వారా నోటీసులు ఇప్పించి పొలాలను చౌకగా కొట్టేస్తున్నారని మండిపడ్డారు.
ఆధారాలు ఇస్తాం.. చర్యలు తీసుకునే దమ్ము ఉందా: గరుడంపల్లిలో సోలార్‌ప్లాంట్‌కు కేటాయించిన 106 ఎకరాలను కంపెనీ ప్రతినిధుల్ని బెదిరించి తక్కువకు కాజేశారని ధ్వజమెత్తారు. ప్రధాన రహదారికి ఆనుకుని వందల ఎకరాలు కొట్టేసినట్లు విమర్శించారు. ఉప్పలపాడు రీచులో బినామీలను పెట్టుకుని రోజుకు వందల టిప్పర్లలో బెంగళూరుకు ఇసుకను తరలిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. ముదిగుబ్బలో ఎమ్మెల్యే అనుచరుడు నారాయణరెడ్డి 50 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని.. కావాలంటే ఆధారాలిస్తాం చర్యలు తీసుకునే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. ధర్మవరం పట్టణంలోని బస్టాండు ఎదురుగా ఉన్న సాయినగర్ కాలనీని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు.