Kadiri Urban CI : పోలీస్.. అంటే రక్షకుడు. ఆపదలో ఉన్న వారికి, అణగారిన, బలహీన వర్గాలకు భరోసా. అక్రమార్కుల గుండెల్లో పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో ఎంతో మంది పోలీస్ కొలువును ఎంచుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఖాకీ డ్రెస్ వేసుకోవాలని కలలుగంటారు. ఆ వృత్తికి, ధరించే యూనిఫామ్ కు ఉన్న గౌరవం అలాంటిది. కానీ, కొంతమంది పోలీస్ అధికారుల వ్యక్తిత్వం ఆశాఖకే మచ్చతెస్తోంది. అధికార పార్టీ ఆగడాలను ఎదిరించే వారినే అణచివేయడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో ఐపీసీ చట్టానికి బదులు వైసీపీ చట్టం అమలవుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి. చట్టం అధికార పార్టీ చుట్టం అన్నట్లుగా, ప్రభుత్వాన్ని, అధికార పార్టీని విమర్శించినా పౌరుషం పుట్టుకొస్తోంది. సోషల్ మీడియాలో చిన్న పోస్టింగ్ పెట్టినా... నోటీసుల పేరిట రాద్ధాంతం చేస్తున్నారు. మరోవైపు.. అధికార పార్టీ నేతలు బండబూతులు తిట్టినా, ఇళ్లపై దాడులు చేసినా, కర్రలతో చావబాదినా సరే చోద్యం చూస్తున్నారు. బాధ్యులపై కాకుండా బాధితులపైనే కేసులు మోపి శారీరక, మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
రాజకీయ నాయకుడిని తలపించేలా... శ్రీసత్యసాయి పట్టపర్జి జిల్లా కదిరి అర్బన్ సీఐ మధు రాజకీయ నాయకుడిని తలపించేలా వ్యవహరించారు. అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపైకి దూసుకుపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు సీఐ మధును భుజాల మీదకు ఎత్తుకుంటే మీసాలు మెలేస్తూ సవాల్ విసిరారు. గతంలోనూ ఆయన అధికారపార్టీ నాయకుల అండ చూసుకుని తెదేపా నాయకులపైకి తొడగొట్టారు. స్టేషన్ కు వచ్చిన మహిళా నాయకులను అవమానపరిచారు. మరోసారి మహిళా కౌన్సిలర్ ను అసభ్యంగా మాట్లాడటంతో పాటు మహిళలపై చేయిచేసున్నట్లు బాధితులు ఆరోపించారు. అంతటితో ఆగక సీఐ తీరును తప్పుపట్టిన తెదేపా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పై సవాల్ విసురుతూ మీసాలు తిప్పి తొడగొట్టారు. బండబూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఆయనను వైకాపా నాయకులు భుజాలపై మోసుకుంటూ అనుకూల నినాదాలు చేయడం విస్మయానికి గురిచేసింది.