కూలి పనులకు వెళుతున్న మహిళలను మృత్యువు కబళించింది. వారు ప్రయాణిస్తున్న ఆటోపై అనూహ్యంగా విద్యుత్తు తీగ తెగిపడి రెప్పపాటులో ఐదుగురు బుగ్గి పాలయ్యారు. ఇంటినుంచి బయలుదేరిన పది నిమిషాల వ్యవధిలోనే సజీవ దహనమయ్యారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. ఐదుగురు మరణించడంతో పాటు ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్, మరో ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన మహిళ కుమారికి చెందిన వేరుసెనగ చేనులో కలుపు తీయడానికి గురువారం ఉదయం గుడ్డంపల్లికి చెందిన కూలీలు రెండు ఆటోల్లో బయలుదేరారు. చిల్లకొండయ్యపల్లి గ్రామం దాటి పొలం దారిలో వంద మీటర్లు వెళ్లగానే విద్యుత్తు స్తంభం నుంచి తీగ తెగి వెనకాల వెళుతున్న ఆటోపై పడింది. ఆటోపై ఉన్న ఇనుప మంచెకు తీగ తగిలి విద్యుదాఘాతమేర్పడింది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌తో కలిపి 13 మంది ఉన్నారు. డ్రైవర్ పోతులయ్యతోపాటు ఎనిమిది మంది మహిళలు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఐదుగురు మహిళలు మంటల్లో చిక్కుకున్నారు. ఇద్దరు పూర్తిగా కాలిపోగా, ముగ్గురి శరీరాలు సగం బూడిదయ్యాయి.
క్షణాల్లో బుగ్గి..
ప్రమాదంలో పెద్దకోట్లకు చెందిన పొలం యజమాని కుమారి (35), గుడ్డంపల్లికి చెందిన రత్నమ్మ (40), లక్ష్మీదేవి (36), కాంతమ్మ (45), రామలక్ష్మి (30) అక్కడికక్కడే చనిపోయారు. అదే గ్రామానికి చెందిన యువతి గాయత్రి తీవ్రంగా గాయపడింది. ఆటోలో మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ పోతులయ్య పరిగెత్తుకెళ్లి చిల్లకొండయ్యపల్లి గ్రామస్థులకు సమాచారమిచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకున్నా విద్యుత్తు సరఫరా ఉండటంతో ఆటో వద్దకు వెళ్లడానికి తొలుత భయపడ్డారు. విద్యుత్తు అధికారులకు ఫోన్ చేసి సరఫరా నిలిపేయించారు. తాడిమర్రిలోని పెట్రోలుబంకు నుంచి మంటలార్పే గ్యాస్ సిలిండర్లను తీసుకొచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గాయత్రిని అనంతపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి బెంగళూరుకు తీసుకెళ్లారు. మృతదేహాలకు ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి.
సీఎం దిగ్భ్రాంతి.. రూ.10 లక్షల చొప్పున పరిహారం..
విద్యుదాఘాతమై ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల, బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్యారిస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ప్రమాద ఘటన వివరాల్ని అధికారులు తెలియజేసినట్టు సీఎం కార్యాలయం ప్రకటనలో తెలిపింది. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5లక్షల సాయం ప్రకటించారు. వారికి ఏపీఎస్పీడీసీఎల్ రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థికసాయాన్ని అందిస్తామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు తెలిపారు.