Postmortem to squirrel at Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం ఐదుగురు కూలీలు సజీవ దహనమైన ఘటనలో ఉడత కళేబరానికి పరీక్షలు పూర్తి చేశారు. తాడిమర్రి పశువైద్యశాలలో పరీక్షలు చేసిన పశువైద్యులు.. నివేదిక వివరాలను గోప్యంగా ఉంచారు. ఉడత పరీక్ష వివరాలు మీడియాకు ఇవ్వొద్దని పోలీసులు చెప్పారని పశువైద్యులు చెబుతున్నారు. చిల్లకొండయ్యపల్లి వద్ద నిన్న ఉదయం విద్యుత్త తీగ తెగి ఆటోపై పడిన దుర్ఘటనలో ఐదుగురు బుగ్గిపాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి ఓ ఉడత కారణమని విద్యుత్తుశాఖ అధికారులు వింత వాదన తెరపైకితేగా.. పోలీసులు మరో అడుగు ముందుకేసి తాడిమర్రి పశువైద్యశాలలో ఇవాళ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ఘటనాస్థలిని విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. కరెంటు స్తంభం వద్ద తెగిన తీగను పరిశీలించారు.
సత్యసాయి జిల్లాలో ఉడత కళేబరానికి పరీక్ష.. గోప్యంగానే వివరాలు - తాడిమర్రి పశువైద్యశాలలో ఉడతకు పరీక్ష
15:57 July 01
నివేదిక వివరాలు వెల్లడించని పోలీసులు
ప్రమాదానికి ఉడతే కారణం:చిల్లకొండయ్యపల్లి వద్ద ప్రమాదానికి ఓ ఉడత కారణమని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు. కరెంటు స్తంభం పైకి ఉడత ఎక్కినప్పుడు ఇన్సులేటర్ నుంచి కండక్టర్‌కు షార్ట్‌సర్క్యూట్ అయి మధ్యలో తీగ తెగి అదే సమయంలో అటుగా వస్తున్న ఆటోపై పడిందని ఎస్పీడీసీఎల్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే స్థానిక రైతులు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. తీగలు, బుడ్డీలు (ఇన్సులేటర్లు) నాసిరకంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. గ్రామ పరిధిలోని పొలాల్లో 6నెలల కిందటే 11 కేవీ లైను ఏర్పాటుచేశారు. ఇందులో ఎల్టీ (లోటెన్షన్) తీగలు వాడారని రైతులు చెబుతున్నారు. పాత విద్యుత్తు తీగలు లాగుతుండటంపై గుత్తేదారులను ప్రశ్నించినా లెక్క చేయలేదని వాపోతున్నారు. నాసిరకం తీగలను మార్చాలని విద్యుత్తు అధికారులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వివరిస్తున్నారు. అధికారులు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రమాదానికి ఉడతే కారణమని చెబుతున్నారని విమర్శిస్తున్నారు.
నిపుణులేం చెబుతున్నారంటే..?:విద్యుత్తు స్తంభాలపై పక్షులు వాలటం, ఉడత, తొండలాంటి ప్రాణులు ఎక్కటం సాధారణమే. ఉడతలాంటివి తీగలపైకి ఎక్కినప్పుడు షార్ట్‌సర్క్యూట్ అయితే సంబంధిత సబ్‌స్టేషన్‌లో ట్రిప్ అయి సరఫరా నిలిచిపోతుందని నిపుణులు చెబుతున్నారు. తీగ తెగిపడినా ట్రిప్ అవుతుందని, ఇందుకోసం ప్రతి ఫీడర్‌లో ప్రత్యేకంగా బ్రేకర్లను ఏర్పాటుచేస్తారని పేర్కొంటున్నారు. అయితే చిల్లకొండయ్యపల్లి ప్రమాద సంఘటనలో ఉడత కారణంగా షార్ట్‌సర్క్యూట్ అయి తీగ తెగింది. ట్రిప్ అయి సరఫరా నిలిచిపోలేదు. తీగ తెగినప్పుడు కరెంటు పోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇన్సులేటర్లు, కండక్టర్లు, తీగలు నాసిరకంగా ఉండటం వల్లే ట్రిప్ అవ్వలేదని అభిప్రాయపడుతున్నారు.
ఏం జరిగిందంటే..:కూలి పనులకు వెళుతున్న మహిళలను మృత్యువు కబళించింది. వారు ప్రయాణిస్తున్న ఆటోపై అనూహ్యంగా విద్యుత్తు తీగ తెగిపడి రెప్పపాటులో ఐదుగురు బుగ్గి పాలయ్యారు. ఇంటినుంచి బయలుదేరిన పది నిమిషాల వ్యవధిలోనే సజీవ దహనమయ్యారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. ఐదుగురు మరణించడంతో పాటు ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్, మరో ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన మహిళ కుమారికి చెందిన వేరుసెనగ చేనులో కలుపు తీయడానికి గురువారం ఉదయం గుడ్డంపల్లికి చెందిన కూలీలు రెండు ఆటోల్లో బయలుదేరారు. చిల్లకొండయ్యపల్లి గ్రామం దాటి పొలం దారిలో వంద మీటర్లు వెళ్లగానే విద్యుత్తు స్తంభం నుంచి తీగ తెగి వెనకాల వెళుతున్న ఆటోపై పడింది. ఆటోపై ఉన్న ఇనుప మంచెకు తీగ తగిలి విద్యుదాఘాతమేర్పడింది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌తో కలిపి 13 మంది ఉన్నారు. డ్రైవర్ పోతులయ్యతోపాటు ఎనిమిది మంది మహిళలు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఐదుగురు మహిళలు మంటల్లో చిక్కుకున్నారు. ఇద్దరు పూర్తిగా కాలిపోగా, ముగ్గురి శరీరాలు సగం బూడిదయ్యాయి.
ఇదీ చదవండి: