LEPAKSHI KNOWLEDGE HUB తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సాగు భూమి చేజారిపోయింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కంపెనీ ఆచూకీ లేకుండా పోయింది . రైతన్నలు.. కూలీలు, కార్మికులుగా మారిపోయారు. మరికొందరు దుర్భర జీవనం సాగిస్తున్నారు. అసలే వెనకబడిన.. ఉపాధి అవకాశాలే లేని ప్రాంతం.. పంట పండితేనే బతుకు సాగే దైన్యం. అలాంటి చోట చిన్న, సన్నకారు రైతులకు ఎన్నో ఆశలు కల్పించిన నాటి ప్రభుత్వ పెద్దలు.. పరిశ్రమలు, ఉద్యోగాల పేరిట వేల ఎకరాలు సేకరించారు. 15 ఏళ్లు గడుస్తున్నా.. ఒక్క పరిశ్రమా ఏర్పాటు కాలేదు. ఉద్యోగాలూ ఇచ్చింది లేదు. కొందరికైతే పరిహారం అందలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ వారి జీవితాలను మసకబారేలా చేసింది. అప్పట్లో తమ నుంచి సేకరించిన భూముల్ని ఇప్పుడు కొందరు అప్పనంగా కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి.. రైతులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు.
లేపాక్షి నాలెడ్జ్ హబ్.. ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు, యువతకు ఎన్నో ఆశలు కల్పించింది. పలు పరిశ్రమలు, సంస్థలు ఏర్పాటు చేసి.. రైతులకు పరిహారంతో పాటు.. ఇంటింటికీ ఉద్యోగాలు ఇస్తామని.. 2006లో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రైతులు భయపడకుండా భూముల్ని హబ్ కోసం ఇచ్చేయాలని.. గ్రామాల్లో శిబిరాలు పెట్టి మరీ చెప్పారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకుని.. గోరంట్ల, చిలమత్తూరు మండలాల్లో.. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల, మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా.. 8 వేల 844 ఎకరాల భూమిని సేకరించారు.
ఆ భూమినంతా.. ఇందు ప్రాజెక్టుకు చెందిన లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు అప్పగించారు. పరిశ్రమలు పెడతామని చెప్పిన ఆ సంస్థ.. సేకరించిన భూముల్ని బ్యాంకుల్లో తనఖా పెట్టి.. 4 వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది. భూముల కేటాయింపు విషయంలో ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా.. భూముల్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈలోపే రైతుల భూముల్ని తాకట్టుపెట్టి తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో బ్యాంకులు దివాలా ప్రక్రియను చేపట్టాయి. వేలంలో.. సుమారు పదివేల కోట్ల రూపాయల విలువైన ఈ భూముల్ని కేవలం 500 కోట్లకే ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పరిశ్రమలు వస్తే తమ జీవితం, పిల్లల భవిష్యత్తు బాగుంటుదని ఆశించిన రైతులు.. తాజా పరిణామాలపై భగ్గుమంటున్నారు.
44వ జాతీయ రహదారిని ఆనుకుని గోరంట్ల, చిలమత్తూరు మండలాల్లోని 6 పంచాయతీల పరిధి గ్రామాల నుంచి లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం.. భూములు సేకరించారు. 2007-08లో పరిహారానికి సంబంధించి 88.44 కోట్ల రూపాయలను ప్రభుత్వం.. జిల్లా కలెక్టర్ ఖాతాకు బదిలీ చేసింది. కానీ.. ఇప్పటికీ పరిహారం అందని రైతులు వందల సంఖ్యలో ఉన్నారు. అన్నదమ్ముల మధ్య వివాదాలతో ఆయా భూముల్ని నిషేధిత జాబితాలో ఉంచి.. కొందరు రైతులకు పరిహారం ఇవ్వలేదు. మరికొందరు రైతుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకుని.. పరిహారం ఇవ్వకుండానే.. ఆయా భూముల్ని లేపాక్షి హబ్ కిందకు చేర్చేశారు.