శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన బీఫార్మసీ విద్యార్థినిపై (20) చనిపోవడానికి ముందు అత్యాచారం జరిగిందని తేలింది. ప్రియుడు సాదిక్ (32) మాయమాటలతో నమ్మించి, శారీరకంగా అనుభవించి చనిపోయేలా ప్రేరేపించాడని వెల్లడించారు. అదే విషయాన్ని నిందితుడు వాంగ్మూలం ఇచ్చినట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ సోమవారం వెల్లడించారు. అత్యాచారం జరిగినట్లు రీ పోస్టుమార్టంలో తేలిందని, సాదిక్‌పై ఇదివరకే హత్యానేరం కింద కేసు నమోదు చేయగా, ఇప్పుడు అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్లను జత చేశామని తెలిపారు. అతడిని ఆదివారం అరెస్టు చేశామని తెలిపారు. అయితే ఈ కేసు దర్యాప్తులో పోలీసుల తీరుపై మొదటి నుంచీ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక రాకముందే ఆమెది ఆత్మహత్యగా నిర్ధారించడం, మొదటి పోస్టుమార్టం నివేదికలో ఆమెపై అత్యాచారం సంగతిని బయట పెట్టకపోవడం, బాధితురాలి తల్లిదండ్రులు, వివిధ వర్గాలవారు ఆందోళన చేశాక, రీపోస్టుమార్టం నిర్వహించి.. అత్యాచారం గురించి నిర్ధారించడం వంటివి వారి తీరుపై పలు సందేహాలు లేవనెత్తాయి.
బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది.. రీపోస్టుమార్టం తర్వాత వాస్తవాలు వెల్లడి - b pharmacy student was raped before she died
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని చనిపోవడానికి ముందు, అమెపై అత్యాచారం జరిగిందని పోలీసులు ఎట్టకేలకు నిర్ధారించారు. తేజస్వినిని ఆమె ప్రియుడు సాదిక్ మాయమాటలతో నమ్మించి మోసంచేసి, శారీరకంగా అనుభవించి చనిపోయే విధంగా ప్రేరేపించాడని వెల్లడించారు. అదే విషయాన్ని అంగీకరిస్తూ నిందితుడు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిపారు.
నిందితుడు లొంగిపోయాడా?:విద్యార్థిని అనుమానాస్పద మృతి వ్యవహారం ఈ నెల 5న వెలుగులోకి వచ్చింది. గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపంలో సాదిక్‌కి చెందిన గదిలో ఆమె మృతదేహం చున్నీకి వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదే రోజు మధ్యాహ్నం సాదిక్‌పై కేసు నమోదు చేశారు. బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోస్టుమార్టంలో తేలిందని పోలీసులు చెప్పడంతో.. నిందితుడిని కాపాడేందుకు వారు ప్రయత్నిస్తున్నారంటూ బంధువులు ఆందోళన చేశారు. దీంతో మృతదేహాన్ని రీ పోసుమార్టంకు పంపించారు. విద్యార్థిని చనిపోయిన విషయాన్ని సాదిక్ 5నే పోలీసులకు చెప్పి, లొంగిపోయాడని, అతను ఇచ్చిన సమాచారం ఆధారంగానే వారు ఘటనా స్థలానికి వెళ్లారని వార్తలు వచ్చాయి. కానీ పోలీసులు దీన్ని ఖండిస్తున్నారు. మరి ఆమె మృతి విషయం వారికి ఎలా తెలిసింది? సాదిక్ అదే రోజు లొంగిపోయి ఉంటే.. అప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదు? ఆమెపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని ఐదో తేదీన పోస్టుమార్టం నివేదిక వచ్చినప్పుడు ఎందుకు బయట పెట్టలేదు? సాధారణంగా ఇలాంటి కేసుల్లో బాధితురాలిపై లైంగిక దాడి జరిగిందా? అనేది కీలకం. మరి ఆ కోణాన్ని ఎందుకు విస్మరించారు? రీపోస్టుమార్టం నివేదిక రాకముందే.. బాధితురాలిది ఆత్మహత్యేనని జిల్లా ఎస్పీ ఎలా చెప్పారు? ఇంత తీవ్రమైన కేసుల్లో పోలీసులు హడావుడిగా ఒక నిర్ధారణకు ఎలా వచ్చేశారు? వంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి:'నిన్నటి ఆత్మహత్య.. ఈరోజు రేప్'గా ఎలా మారింది?: నారా లోకేశ్