ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంతెన పూర్తి అయ్యేదెప్పుడు.. ప్రజల కష్టాలు తీరేదెప్పుడు - చిత్రావతి నదిపై శాశ్వత వంతెన పూర్తి వివరాలు

Bridge Issue Over Chitravathi River: వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామం నుంచి ఏ విద్యార్థి బడికెళ్లలేని పరిస్థితి. నదిలో ప్రవాహంతో రైతులు పొలం పనులకూ పోలేని దుస్థితి. ధర్మవరం మండలం.. పోతులనాగేపల్లి-కనుంపల్లి గ్రామాల మధ్య చిత్రావతి నదిపై వంతెన లేక ప్రజల అవస్థలు.. వర్ణణాతీతంగా మారాయి. కష్టాల నుంచి గట్టెక్కేందుకు..ప్రజలే చందాలు వేసుకుని వంతెన నిర్మాణం చేపట్టారు. వరద ఉద్ధృతికి అది కూడా కొంతమేర కొట్టుకుపోవడంతో..కనుంపల్లి గ్రామస్థుల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి.

Potulanagepalli- Kanumpalli
పోతులనాగేపల్లి- కనుంపల్లి

By

Published : Dec 18, 2022, 2:21 PM IST

చిత్రావతి నదిపై వంతెన పూర్తి అయ్యేదెప్పుడు.. ప్రజల కష్టాలు తీరేదెప్పుడు

Bridge Issue Over Chitravathi River: ధర్మవరం మండలం పోతులనాగేపల్లి-కనుంపల్లి గ్రామాల మధ్య చిత్రావతి నదిపై శాశ్వత వంతెన కోసం 2 దశాబ్దాలుగా స్థానికులు ఎదురుచూస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణానికి 3కోట్ల 80 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. 2019లో.. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిపోయింది. గత ప్రభుత్వంలో నిర్వహించిన టెండర్లు రద్దు చేయాలని పట్టుబట్టిన వైసీపీ ప్రజాప్రతినిధి..వంతెన నిర్మాణం కాకుండా అడ్డుకున్నారు. కొత్తగా టెండర్ నిర్వహిస్తామని చెప్పి మూడున్నరేళ్లు గడిచిపోయాయి. వంతెన వచ్చేస్తుందనుకున్న గ్రామస్తులకు.. కష్టాలు తప్పటం లేదు.

"వాగు దాటుకుని రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. తిరిగి వెళ్లడానికైనా కష్టంగా ఉంది. చివరికి పశువులకు దానా తీసుకుపోవడానికైనా ఇబ్బంది పడుతున్నాము. వ్యవసాయానికి మందు మూటలు తీసుకుపోవటానికి ఇబ్బందే.. రోజు ఇదే పరిస్థితి.. మొన్న మేము సొంతంగా కట్టినకాడికి కూడా విరిగిపోయింది.. వర్షాకాలం వస్తే మాకు ఈ కష్టాలు తప్పటం లేదు.." మల్లికార్జున, గ్రామస్థుడు

"చాలా వరకు ఆర్థికంగా నష్టపోతున్నాం.. పిల్లల చదువులు ఆగిపోయాయి.. అత్యవసర పరిస్థితిలో ఆదుకునే వారే లేరు.. ప్రాజెక్టు పనులు ఆపివేసి రెండు సంవత్సరాలైంది.. తగిన పరిష్కారం చూపే నాయకులే లేరు.. ప్రాజెక్టు ఆగిపోవడానికి రాజకీయ కారణాలేంటో అర్థం కావట్లేదు.." రాజారెడ్డి, గ్రామస్థుడు

పోతులనాగేపల్లి గ్రామస్తుల వ్యవసాయ భూములన్నీ కనుంపల్లి సమీపంలోనే ఉన్నాయి. రైతులు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న వంతెనపైనే వెళ్లాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా భారీ వర్షాల వల్ల చిత్రావతి నదిలో వరద ప్రవాహం పెరిగింది. ప్రజలే చందాలు వేసుకుని చెక్‌ డ్యాం రహదారి తరహాలో వంతెన నిర్మాణం చేపట్టారు. వరద ఉద్ధృతికి అది కూడా కొంతమేర కొట్టుకుపోయిందని గ్రామస్థులు వాపోతున్నారు.

"కరెక్ట్ పరిష్కారం కనిపించటం లేదు.. మామూలుగా ఆనకట్ట కడదామన్నారు.. దీనివల్ల పైనుంచి వరద వెళ్తుతుంది..మళ్లీ అదే సమస్య.. ప్రతీ సంవత్సరం గ్రామంలో ప్రజలందరి నుంచి కొంత సొమ్మును సేకరించి ..తాత్కాలిక వంతెన నిర్మించుకుంటున్నాము కానీ..శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవట్లేదు.." -ఆదర్ష్, విద్యార్థి

"గవర్నమెంట్ మారిన తరువాత.. మళ్లీ రీ-టెండరుకు పిలిచి..జరుగుతున్న పనులను ఆపివేశారు.. మొదట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లను ప్రజలు హర్షించారు.. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో.. కాజ్​వే పూర్తయిపోతుందని గ్రామస్థులు సంతోష పడ్డారు..కానీ ప్రభుత్వం మారటం వల్ల మా గ్రామానికి మళ్లీ చీకటి రోజులు ఎదురయ్యాయి.." లక్ష్మీనారాయణ, గ్రామస్థుడు

"ఇటీవల వర్షాలు కారణంగా.. గ్రామస్తులు సొంత మూలధనంతో.. తాత్కాలికంగా నిర్మించుకుంటున్న కాజ్​ వే పూర్తిగా కొట్టుకుపోయింది.. ప్రభుత్వం స్పందించి పెద్ద బ్రిడ్జ్ పూర్తి చేసే వరకు గ్రామస్తులకు సమస్య తీరదు.. ప్రతి ఒక్క రైతు పొలానికి పోవడానికైనా, ఇతురులు వేరే ప్రాంతానికి పోవడానికైనా కష్టంగా ఉంది.." శివారెడ్డి, గ్రామస్థుడు

ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details