LOKESH REVELEAD EVIDANCE OF MLA KETHIREDDY LAND : రాష్ట్రంలో సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్నటివరకు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అన్నట్లు పరిస్థితి ఉంది. ఎవ్వరికి ఎవరూ తగ్గేదే లే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. శనివారం నాడు సత్యసాయి జిల్లాలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎర్రగుట్టను ఆక్రమించారంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దానికి సంబంధించిన పలు ఆధారాలను బయటపెడుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎర్రగుట్టపై 20 ఎకరాలు కబ్జా చేసి స్థానిక ఎమ్మెల్యే విలాసవంతమైన భవనంతో పాటు బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారని పాదయాత్ర సందర్బంగా లోకేశ్ ఆరోపించారు. అయితే లోకేశ్ కామెంట్లపై స్పందించిన ఎమ్మెల్యే.. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తానని సోమవారం సవాల్ చేశారు. ఈ క్రమంలో లోకేశ్ మంగళవారం ఎర్రగుట్ట ఆక్రమణపై ఆధారాలను బయటపెట్టారు.
గూగుల్ పట్టేసింది కేతిరెడ్డి:గుట్టపైన 20 ఎకరాలను కబ్జాను గూగుల్ పట్టేసిందంటూ లోకేశ్ ఫోటోలు విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ ప్రకారం.. కేతిరెడ్డి తమ్ముడు భార్య గాలి వసుమతి పేరుతో కొన్నది కేవలం 25.38 ఎకరాలు మాత్రమేనని డాక్యుమెంట్ వివరాలు లోకేశ్ బహిర్గతం చేశారు. సర్వే నంబర్లు 904, 905, 908, 909లో వసుమతి పేరుతో రైతుల నుంచి భూములు కొన్నట్టు రికార్డులో ఉందని పేర్కొన్నారు. అయితే గుట్టపైన మొత్తం 45 ఎకరాలు కేతిరెడ్డి అధీనంలో ఉందని ఆరోపించారు. మిగిలిన 20 ఎకరాలు మొత్తం కబ్జా చేశారన్నారు. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కేతిరెడ్డి స్థలాన్ని కొలవగా 45.47 ఎకరాలుగా చూపిస్తోందన్నారు. మిగిలిన 20 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. అందరి సమక్షంలో ఎర్రగుట్టపై ఉన్న భూమిని కొలిపించే దమ్ము ఉందా కేతిరెడ్డి అంటూ లోకేశ్ సవాల్ విసిరారు. ఎర్రగుట్టపై మొత్తం 45.47 ఎకరాలు ఆక్రమించుకొని విలాసమంతమైన ఫామ్‌హౌస్, తోటలు, బోటింగ్ లాంటివి ఏర్పాటు చేసుకున్నారని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న కేతిరెడ్డి.. ఈ ఆధారాలకు ఏం చెప్తారని లోకేశ్ ప్రశ్నించారు.