No Problems to Lepakshi Knowledge Hub Lands: పరిశ్రమలు, ఐటీ పార్కులు ఏర్పాటు చేసేందుకంటూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సత్యసాయి జిల్లాలో 8వేల 844 ఎకరాలను ఇందూ అనుబంధ సంస్థ లేపాక్షి నాలెడ్జి హబ్‌కు ప్రభుత్వం కేటాయించింది. అక్కడ ప్రాజెక్టును అభివృద్ధి చేయకుండా 4వేల 191 ఎకరాలను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్న ఆ సంస్థ.. ఇతర అవసరాలకు వాడుకుంది. ఆ విధంగా బ్యాంకులకు 4వేల కోట్లకు పైగా బకాయి పడి దివాలా తీసింది. ఇందూ దివాలా ప్రక్రియ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులూ వేలంలో పోయే ప్రమాదం ఏర్పడింది. దివాలాలో ఇందూను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించిన ఎర్తిన్ ప్రాజెక్ట్స్‌లో జగన్ మేనమామ కుమారుడు డైరెక్టర్‌గా చేరడం లాంటి విషయాలను 'ఈనాడు-ఈటీవీ-ఈటీవీ భారత్' వెలుగులోకి తెచ్చాయి. ఈ కథనాలు వచ్చాక ఇందూ వేలం నుంచి లేపాక్షి భూములను మినహాయించాలని ఈడీ, A.P.I.I.C వేసిన పిటిషన్లపై N.C.L.T తీర్పులు ఇచ్చింది.
Indu Projects: "లేపాక్షి" భూములకు తప్పిన ముప్పు.. ఎన్‌సీఎల్‌టీ తీర్పులతో స్పష్టం - no problems to lepakshi
No Problems to Lepakshi Knowledge Hub Lands: ఇందూ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియలో భాగంగా.. అనుబంధ సంస్థ లేపాక్షి నాలెడ్జి హబ్ భూములను వేలంలో అమ్మడం లేదు. ఇందూ దివాలాపై N.C.L.T తాజా తీర్పుల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ప్రజల ఆస్తి అయిన లేపాక్షి భూములను కాపాడాల్సిన బాధ్యతున్న ఏపీఐఐసీ ఈ వ్యవహారంలో ఎంత దివాలాకోరుగా వ్యవహరించిందో, ఎంతటి బాధ్యతారహితంగా పనిచేసిందో కూడా ఈ తీర్పుల ద్వారా తేలింది.
వీటితోపాటు గతంలో నిర్వహించిన వేలంలో పాల్గొని, సకాలంలో డబ్బు చెల్లించని ఎర్తిన్ సంస్థ వేసిన పిటిషన్‌ను N.C.L.T కొట్టేసింది. బి.వి.సుబ్బారెడ్డి తదితరులతో కూడిన కన్సార్షియానికి ఇందూను అప్పగించాలని రిజల్యూషన్ ప్రొఫెషనల్ -R.P. ఇచ్చిన ప్రణాళికపైనా తీర్పులు వెలువరించింది. ఈడీ, A.P.I.I.C పిటిషన్లపై ఇచ్చిన రెండు తీర్పులలోనూ ఒక విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. కేసుల విచారణ సందర్భంగా వాదనలు వినిపించేటప్పుడు ఈడీ స్వాధీనంలోని భూములను వేలంలో ఉంచలేదని R.P. చెప్పినందున... ఈ రెండు సంస్థల పిటిషన్లను కొట్టేస్తూ మరో రెండు తీర్పులు ఇచ్చింది. అయితే A.P.I.I.C వేసిన పిటిషన్‌పై ఇచ్చిన తీర్పులో ఆ సంస్థపై N.C.L.T తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేసులో జోక్యం చేసుకుంటూ ఏపీఐఐసీ వేసిన పిటిషన్‌లో అసలు దేనికోసమన్న విజ్ఞప్తి లేదని వ్యాఖ్యానించింది. ఇంతకుముందు ఎర్తిన్ ప్రాజెక్ట్స్‌కు వ్యతిరేకంగా విచారణ సమయంలో వాదన చేయనే లేదని పేర్కొంది. అసలు A.P.I.I.C పిటిషనే సరైన పద్ధతిలో లేదని పేర్కొంది.
A.P.I.I.C ద్వారా లేపాక్షికి ఇచ్చిన 8వేల 844 ఎకరాల్లో పరిశ్రమలు పెట్టకుండా, ఇందూ గ్రూపు ఆ భూములను దుర్వినియోగం చేస్తుండటంతో... 2014 ఫిబ్రవరిలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసింది. అలాంటి భూములపై హక్కులను కాపాడుకునేందుకు పోరాడాల్సిన A.P.I.I.C... దానిపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. Y.S. హయాంలో జరిగిన లేపాక్షి భూకేటాయింపులపై విచారణ చేసిన సీబీఐ... ఆ కుంభకోణంలో జగన్ ప్రధాన పాత్రధారి అని తేల్చింది. ఆయన్ను ఒకటో నిందితుడిగా కేసు పెట్టింది. ఈడీ కూడా ఈ వ్యవహారంపై విచారణ చేసి 8వేల 648.8 ఎకరాలను జప్తు చేసింది. ఆ కేసులో నిందితుడిగా ఉన్న జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు. ఆ భూములను కాపాడటంలో A.P.I.I.C ఏమాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదంటే.. ఆ సంస్థ ప్రస్తుతం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందూ దివాలా విషయంపై N.C.L.Tలో చాలా ఆలస్యంగా పిటిషన్ వేసింది. దాన్నీ సరిగా తయారు చేయించలేదంటే... ఆ సంస్థ ఎవరి కోసం పనిచేస్తోందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.