JC Prabhakar Reddy participated in Yuvagalam: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వ్యాపార వర్గాలతో సమావేశం నిర్వహించారు. యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న నారాలోకేశ్ పెనుకొండ సమీపంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ వద్ద భోజనం విరామం తీసుకొన్నారు. భోజన అనంతరం పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లోని వ్యాపార వర్గాలతో సమావేశం నిర్వహించారు. 4ఏళ్ళ కాలంలో కరోనాతో నష్టపోయిన తమకు ప్రభుత్వం నుంచి పన్నుల భారం అధికమై వ్యాపారులు లోకేశ్‌తో వాపోయారు. తాము అన్నివిధాలా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక కంటే ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల్లో రూ.12 వ్యత్యాసం ఉండడంతో, 11బంకులు మూతపడ్డాయని వెల్లడించారు. ఇసుక అధికధరలు, అందుబాటులో లేకపోవడంతో నిర్మాణరంగం కుదేలయిందని బిల్డర్లు నారాలోకేశ్ ఎదుట వాపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమను ఆదుకొంటే తప్ప కోలుకోలేనంతగా నష్టపోయామని వ్యాపారులు పేర్కొన్నారు.
బ్రాహ్మణ సంఘం: దేశంలోనే ప్రప్రథమంగా బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి సేవలందించింది తెలుగుదేశం పార్టీయే అని టీడీపీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు భాను కీర్తి పేర్కొన్నారు. బుధవారం ఉదయం యువగలం పాదయాత్ర సోమందేపల్లి మండలంలోని నల్లగొండరాయనపల్లి విడదీ కేంద్రం వద్ద బ్రాహ్మణ సంఘం సభ్యులతో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్చో ముఖాముఖి నిర్వహించారు. 2024 లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారని నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు దేశంపార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులకు ఇచ్చిన అన్ని పథకాలను 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశారని లోకేశ్‌కు మొరపెట్టుకున్నారు. లోకేశ్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.