MLA Balakrishna wife Vasundhara participated in the Ugadi festival celebrations: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన ఉగాది పండుగ వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి ఆమె సోదరి గరికపాటి లోకేశ్వరిలు పాల్గొన్నారు. గుడ్డం రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని.. ఉగాది పచ్చడిని తీసుకున్నారు. నందమూరి పురమైన హిందూపురంలో ఉగాది సంబరాలు జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందని వసుంధర దేవి అన్నారు.
ముందుగా హిందూపురంలో ఉన్న తెలుగుదేశం నాయకులు, టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు వసుంధర దేవికి పుష్ప గుచ్చలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వసుంధర దేవి, సోదరి గరికపాటి లోకేశ్వరిలు.. గోమాతకు పూజ చేసి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని.. ఉగాది పచ్చడిని తీసుకున్నారు.
అనంతరం నందమూరి వసుంధర దేవి మీడియాతో మాట్లాడుతూ..''నందమూరి పురమైన హిందూపురంలో ఉగాది సంబరాలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడే ప్రతి ఉగాదిని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. హిందూపురంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఆరోగ్య రథం, అన్నా క్యాంటీన్లు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఇలాగే కొనసాగాలంటే వచ్చే సంవత్సరం ఏమి చేయాలో అందరికీ బాగా తెలుసు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా హిందూపురం అభివృద్ధి కోసమే కృషి చేస్తుంటారు. ఇక్కడ వారి యోగక్షేమాల గురించి, హిందూపురంలోని సమస్యల గురించి ఆయన.. ఎప్పటికప్పుడు స్థానిక నాయకుల ద్వారా అడిగి తెలుసుకుంటారు.'' అని ఆమె అన్నారు.