Fight at Kadiri Government Hospital: కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. అరుపులు, ధూషణలతో ఆసుపత్రి ఆవరణం దద్దరిల్లిపోయింది. రాళ్లతో, కర్రలతో ఇరుకుటుంబాల సభ్యులు పరస్పరం దాడికి దిగడంతో ఆసుపత్రి మొత్తం ఆందోళనకు గురయ్యింది. ఆసుపత్రిలో ఏమి జరుగుతుందో అర్థం కాక బెడ్లపై ఉన్న రోగులు, వారికోసం వచ్చిన బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని ఇరువర్గాల సభ్యులను చెదరగొట్టారు. దీంతో ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది, రోగులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నల్ల చెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి ఘర్షణ మాటమాట పెరిగి.. కర్రలతో, రాళ్లతో కొట్టుకునే స్థితికి తీసుకెళ్లింది. ఘర్షణలో భాగంగా రెండు కుటుంబాల సభ్యులు అసభ్య పదజాలంతో ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ.. రాళ్లతో, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాలకు చెందిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు.