Construction of Jilledu Banda Reservior: ఏదైనా జలాశయం నిర్మించాలన్నా, కాలువ తవ్వాలన్నా రైతులను ఒప్పించి.. భూ సేకరణ చేస్తారు. ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి భూమి కోల్పోతున్న రైతుల అభిప్రాయాలు సేకరిస్తారు. భూమి కోల్పోయే రైతులకు పరిహారం ఇస్తారు. కానీ వీటన్నిటికీ భిన్నంగా శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో జిల్లేడుబండ రిజర్వాయర్ నిర్మాణం జరుగుతున్న తీరు రైతుల్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. పరిహారం ప్రకటించకుండానే పనులు చేస్తుండటంతో బాధితుల్లో ముంపు భయం పట్టుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోకపోవడంపై నిర్వాసితులు మండిపడుతున్నారు.
ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లి వద్ద.. ప్రకృతి సిద్ధమైన జిల్లేడు బండ చెరువు ఉంది. ఈ చెరువును జలాశయంగా మార్చి.. హంద్రీనీవా కాలువ నుంచి నీటిని తరలించి.. 680 కోట్ల రూపాయలతో జిల్లేడు బండ జలాశయాన్ని నిర్మిస్తున్నారు. 2.41 TMCల సామర్థ్యంతో 2021 డిసెంబరులో పనులు ప్రారంభించారు. మూడు సంవత్సరాలలో.. పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరం గడిచిపోయింది. నిర్మాణానికి మొత్తం.. 2వేల 500 ఎకరాల భూసేకరణ చేపట్టగా.. ఇందులో 17వందల 66 ఎకరాలు వ్యవసాయ భూములే. ఓ వైపు గుత్తేదారు కట్ట పనులు చేస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఉన్న ఫళంగా తమ భూములు ఇవ్వాలంటే లక్షలు పెట్టుబడితో సాగు చేసిన పంటలు కోల్పోతామని వారు వాపోతున్నారు.