ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

School in temple: శిథిలావస్థకు పాఠశాల భవనం.. గుడిలో పాఠాలు.. విద్యార్థులకు కష్టాలు - ప్రాథమిక పాఠశాల

school in temple: పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం నిర్మిస్తారని గ్రామస్థులు ఎదురు చూశారు. కానీ, వర్షం కురిసినపుడల్లా భవనం నీరుకారుతుండడంతో ఆందోళనకు గురయ్యారు. విద్యార్థులకు ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందనే భయంతో ముందు జాగ్రత్తగా బోధనను సమీప గుడి ఆవరణలోకి మార్చారు. ప్రభుత్వం స్పందించి నూతన భవనం నిర్మించాలని గ్రామస్థులు, విద్యార్థులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 7, 2023, 5:55 PM IST

గుడి ఆవరణలో కొనసాగుతున్న తరగతి

School in temple: అదో మారుమూల గ్రామం.. గతంలో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలమవడంతో గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పాఠశాల నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని వైటీ రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 17 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. పాఠశాల భవనం పైకప్పు పూర్తిగా శిథిలం అవడంతో వర్షాలకు నీరు కారుతోంది. గోడలు నెర్రలు బారాయి. ఎప్పుడు కూలిపోతుందో తెలియని దుస్థితి. భయంతో పాఠశాల విద్యార్థులను గ్రామంలోని ఆలయంలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఒకే గదిలో ఐదు తరగతులు.. ఒకే ఉపాధ్యాయుడు బోధించడం వల్ల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

సౌకర్యాలు లేకపోవడంతో... ఏడాదిన్నర కాలంగా గుడిలో పాఠాలు బోధించడం వల్ల బోర్డుపై పాఠాలు బోధించేందుకు అడ్డంకిగా మారింది. దీంతో ఓ చిన్న బోర్డుని తెచ్చుకొని ఐదు తరగతుల విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు ఉపాధ్యాయుడు మారుతి. సరైన సౌకర్యాలు లేక పాఠశాల విద్య కుంటుపడుతోంది. విద్యార్థులు ఆడుకునేందుకు కనీసం ఆట స్థలం లేదు. ప్రభుత్వం నిబంధన ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వారంలో ఐదు రోజులు కోడిగుడ్డు ఇస్తారు. గుడిలో కోడి గుడ్లు తినడం హిందూ ధర్మం కాదని, విద్యార్థులు బయటకు వెళ్లి గుడ్డు తిని మొహం కడుక్కుని పాఠశాలకు వస్తున్నారు.

పట్టింపులేని అధికారులు... పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు గ్రామస్థులు పాఠశాల సమస్యను విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయం పక్కన ఆడుకునేందుకు వెళితే పాములు, తేళ్లు వస్తాయన్న భయంతో విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. మధ్యాహ్న భోజనం కూడా నిర్వాహకులుఇంటి వద్దనే వండుకొని వచ్చి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి ఉన్న పాఠశాలకు మరమ్మతులు చేయించడం గానీ, నూతన పాఠశాల భవనం నిర్మించడం గాని చేయాలని విద్యార్థులు ముక్త కంఠంతో వేడుకుంటున్నారు.

మా స్కూలు భవనం ఎప్పుడు కూలుతుందో తెలియదు. అందుకే గుడిలోకి వచ్చి చదువుకుంటున్నాం. మాకు ఆడుకోవడానికి స్థలం కూడా లేదు. అధికారులు స్పందించి మాకు చదువుకోవడానికి పాఠశాల భవనం నిర్మించాలి. -విద్యార్థులు

స్కూల్ భవనం పాడుబడడంతో సంవత్సరం నుంచి బ్రహ్మం గారి గుడిలో తరగతులు పెట్టాం. బడి ఎప్పుడు కూలుతుందో తెలియక భయం భయంగా ఉంది. ప్రభుత్వం స్పందించి పాఠశాలను పునర్నిర్మించాలని కోరుతున్నాం. - వెంకటేశ్, పాఠశాల కమిటీ చైర్మన్

రెండు సంవత్సరాల కిందట కురిసిన వర్షాలకు పాఠశాల భవనం తీవ్రంగా దెబ్బతిన్నది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో గుడి కమ్యూనిటీ భవనంలో తరగతులు నిర్వహిస్తున్నాం. ఇక్కడ సరైన వసతులు లేని కారణంగా బోధన ఇబ్బందిగా ఉంది. - మారుతి,ఉపాధ్యాయుడు

ABOUT THE AUTHOR

...view details