Farmers Agitation For Industries : సత్యసాయి జిల్లా గోరంట్లలో కేంద్ర ప్రభుత్వం బెల్ పరిశ్రమ కోసం 2015లో 913 ఎకరాల భూమిని.. ఏరోస్పేస్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్ పరిశ్రమ కోసం మరో 254 ఎకరాల్ని రైతుల నుంచి సేకరించారు. ఈ భూములు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండడం, జాతీయ రహదారికి ఇరువైపులా ఉండడంతో.. కేంద్రం పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం ముందుకు వచ్చింది. అప్పటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో బెల్ పరిశ్రమకు.. పాలసముద్రం మిషన్ తండా వద్ద శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశ్రమల నిర్మాణంలో ఎటువంటి కదలిక లేదు. కేవలం ప్రహరీ చుట్టూ అంతర్గత సిమెంటు రోడ్డును మాత్రమే పూర్తి చేశారు. 913 ఎకరాల భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి గేటును అమర్చారు. తొమ్మిది ఏళ్లు అవుతున్నా ఇంకా పునాది కూడా పడకపోవటంతో భూనిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమలు వస్తే తమ పిల్లలకు ఉపాధి లభిస్తుందని ఆశించి భూములు ఇస్తే.. ఇప్పుడు వాటిని పట్టించుకునే నాథుడే లేరని భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర బడ్జెట్లో కూడా ఈ పరిశ్రమలకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమలు పూర్తైయి.. ఉద్యోగాలు వచ్చే నాటికి తమ పిల్లల భవిష్యత్ మరింత అంధకారమవుతుందని వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని పరిశ్రమలను త్వరితగతిన పూర్తి చేసి తమ బిడ్డలకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో తమ భూములు వెనక్కి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.