ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP High Court: జ్యుడీషియల్‌ అధికారిని బెదిరించడానికి ఎంత ధైర్యం?.. సీఐపై హైకోర్టు ఆగ్రహం - హిందూపురం వన్‌టౌన్‌ సీఐ ఇస్మాయిల్​పై హైకోర్టు

AP High Court
AP High Court

By

Published : May 8, 2023, 1:08 PM IST

Updated : May 9, 2023, 6:21 AM IST

13:03 May 08

అడ్వకేట్‌ కమిషనర్‌గా వెళ్లిన న్యాయవాదిపై దురుసు ప్రవర్తనపై ఆగ్రహం

High Court Angry on Hindupuram One Town CI: అడ్వకేట్ కమిషనర్‌ను, కోర్టు సిబ్బందిని కొట్టిన సీఐపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జ్యుడిషియల్ అధికారి పట్ల అరాచకంగా వ్యవహరించడానికి ఎంత ధైర్యం అంటూ మండిపడింది. సదరు సీఐపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 14కు వాయిదా వేసిన హైకోర్టు... సీఐ ఇస్మాయిల్ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

న్యాయస్థానం ఆదేశాల మేరకు అడ్వకేట్‌ కమిషనర్‌గా నియమితులైన న్యాయవాది ఉదయసింహారెడ్డితో పాటు కోర్టు సిబ్బంది శివశంకర్‌పై హిందూపురం ఒకటో పట్టణ సీఐ ఇస్మాయిల్‌ చేయి చేసుకోవడంపై.. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐ ప్రవర్తన న్యాయ పరిపాలన ప్రక్రియకు ఆటంకం కలిగించడమేనని.. బాధ్యుడైన సీఐపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. పోలీసులు బెదిరింపులకు పాల్పడితే... దిగువ కోర్టులు ఏవిధంగా పని చేస్తాయని నిలదీసింది.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకునేందుకు సుమోటోగా నమోదు చేసిన పిల్‌లో... ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, అనంతరపురం రేంజ్‌ డీఐజీ, శ్రీసత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా ఎస్పీలు, పెనుకొండ డీఎస్పీ, హిందూపురం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ S.H.O, సీఐ ఇస్మాయిల్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తాజాగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసు, సుమోటో పిల్‌ కలిపి విచారణ చేస్తామని పేర్కొంది. తదుపరి విచారణను జూన్‌ 14కు వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు సీఐ ఇస్మాయిల్‌ వ్యక్తిగతంగా హాజరు కావాలని... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ N.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

గిరీష్‌ అనే వ్యక్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన వ్యాజ్యంపై.. హిందూపురం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు విచారణ జరిపింది. హిందూపురం ఒకటో పట్టణ ఠాణాకు వెళ్లి వాస్తవాలు పరిశీలించి నివేదిక ఇవ్వమంటూ.. న్యాయవాది పి.ఉదయసింహారెడ్డిని ‘అడ్వకేట్‌ కమిషనర్‌’గా నియమించింది. గిరీష్‌ అక్రమ నిర్బంధంలో ఉంటే కోర్టు ముందుకు తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈమేరకు ఉదయసింహారెడ్డి, ఆయనకు సహాయకుడిగా ఉన్న కోర్టు సిబ్బంది శివశంకర్, నిర్బంధంలో ఉన్న వ్యక్తి తరఫు న్యాయవాది, ఆయన కుటుంబ సభ్యులు 2022 అక్టోబర్‌ 21న ఠాణాకు వెళ్లారు. గిరీష్‌ అక్రమ నిర్బంధంలో ఉన్నారని, పోలీసులు కొట్టినట్లు అడ్వకేట్ కమిషనర్‌ గమనించారు.

అతన్ని కోర్టు ముందు హాజరుపరిచేందుకు తీసుకెళతానని చెప్పగా... సీఐ ఇస్మాయిల్‌ నిరాకరించారు. ఈ క్రమంలో అడ్వకేట్‌ కమిషనర్‌తోపాటు కోర్టు సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు గిరీష్‌ను కోర్టు ముందు హాజరుపరిచారు. అతడికి వైద్య పరీక్షలు చేయించగా... పోలీసులు చిత్రహింసలకు గురిచేసినట్లు తేలింది. ఈ వ్యవహారంలో సీఐపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులను డీఐజీతోపాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పంపారు.

ఈ వ్యవహారం హైకోర్టు రిజిస్ట్రార్‌ విజిలెన్స్‌కు చేరింది. ఆ సమయంలో అనంతపురం జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జిగా ఉన్న హైకోర్టు అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌... ఇది చాలా తీవ్రమైన వ్యవహారంగా పరిగణించారు. న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడేందుకు ఈ అంశాన్ని సుమోటో పిల్‌గా పరిగణించాలని నిర్దేశించారు. పిల్‌ను కమిటీ ముందు ఉంచేందుకు ఈ వ్యవహారాన్ని హైకోర్టు సీజే దృష్టికి తీసుకెళ్లాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ వ్యహారాన్ని సుమోటో పిల్‌గా పరిగణించిన హైకోర్టు... తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఐని వీఆర్‌కు పంపామని హాంశాఖ తరపు న్యాయవాది మహేశ్వరరెడ్డి హైకోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో స్థాయి నివేదిక కోర్టు ముందు ఉంచుతామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 9, 2023, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details