ప్రకాశం జిల్లా ఒంగోలులో జడ్పీ తుది సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు. రెండేళ్లలో వెలుగొండ పూర్తిచేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వెలుగొండ మొదటి టన్నెల్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
కొత్త పథకం
జూలై 8న వైెఏస్సార్ జయంతి పురస్కరించుకుని 'బాలికలే భవిష్యత్తు.. చదవాలి ఎదగాలి' పేరుతో కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. దీని ద్వారా బాలికలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే శిథిలావస్థలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను కూల్చేసి కొత్తవాటిని నిర్మిస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని పునరుద్ఘాటించారు.