YSRCP Leaders Land Scam:ప్రకాశం జిల్లాలో భూ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో వైసీపీ నాయకులు ఉండడం.. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడం.. ఆ పార్టీ నేతలను కలవరపరుస్తుంది. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి, నిందుతుల పేర్లు బయటపెట్టాలని బాలినేని డిమాండ్ చేయగా, సీఎంవో ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. మరోవైపు నిందితుల్లో అగ్రనేతలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒంగోలులో ఇటీవల వెలుగుచూసిన నకిలీ పత్రాల కుంభకోణం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పంచాయితీ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. సీఎంవో అదనపు కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలతో.. జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ మలికా గార్గ్ తాడేపల్లి వెళ్లారు. సీఎంవోలో అదనపు కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ సీతారామాంజనేయులుతో భేటీ అయ్యారు.
రుషికొండను మించిన విధ్వంసం.. మంత్రి గుడివాడ అమర్నాథ్ సమక్షంలోనే
రెండు రోజుల పాటు సీఎంవోలో జరిగిన పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. గురువారం మాజీమంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డిని కలిసి మాట్లాడారు. ఈ కేసును తేల్చాలని ప్రకాశం కలెక్టర్, ఎస్పీలకు తాను చెప్పినా సరిగా స్పందించడం లేదని వారికి గట్టిగా చెప్పాలని కోరారు. దీంతో కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ మలికా గార్గ్‌లను శుక్రవారం పిలిపించి బాలినేని సమక్షంలోనే ధనుంజయరెడ్డి మాట్లాడారు.
నిందితుల పేర్లను బయటపెట్టి తర్వాత దర్యాప్తును కొనసాగించండని బాలినేని కోరినట్లు తెలిసింది. ‘దర్యాప్తులో లభించే ఆధారాల మేరకే నిందితుల వివరాలను వెల్లడించడం, అరెస్టు చేయడమనేది విధానం’ అని ఎస్పీ తెలిపినట్లు సమాచారం. ‘రాజకీయంగా నన్ను ఇబ్బందిపెట్టేలా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా ఈ కేసు విషయమై లీకులను ఇస్తున్నారంటూ బాలినేని ఆరోపించినట్లు తెలిసింది. కేసులో ఇప్పటివరకూ వివిధ శాఖల సహకారంతో చేసిన దర్యాప్తు వివరాలను ఎస్పీ చూపించినట్లు తెలిసింది.
Temple lands: ఆలయ భూములపై అధికార పార్టీ నేతల కన్ను.. లీజు పేరుతో 9 ఎకరాలకు టోకరా
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలులో కొందరు భూ కుంభకోణానికి తెర లేపారు. గుంటూరు, చిలకలూరిపేట, ఇతర ప్రాంతాల నుంచి 100, 50 , 20 స్టాంప్ పేపర్లు కొనుగోలు చేశారు. అధికారుల పేర్లతో తమకు కావాల్సిన ముద్రలు, రౌండ్ సీల్స్ తయారు చేసుకున్నారు. పాత బాండ్ పత్రాలు, నకిలీ వీలునామాలు, పాత తేదీలతో ఒప్పంద పత్రాలు రూపొందించారు.
శివారు ప్రాంతాల్లోని వివాదాస్పద భూములపై కన్నేశారు. భూ యజమానుల మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి జీపీఏ పొందడం, పాత తేదీలతో ఒప్పందాలు తయారు చేసి ఆ భూములను వివాదాల్లోకి లాగారు. తద్వారా యజమానులను బెదిరించి కోట్లు దండుకున్నారు. నకిలీ దస్తావేజులు, పత్రాలతో జరిగిన భూ కుంభకోణంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుయాయులే సూత్రధారులంటూ ఇటీవల ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు గుప్పించారు.