ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Video Viral: 'పెద్దాయననే విమర్శిస్తావా?'.. సొంత పార్టీ కార్యకర్తపై వైకాపా శ్రేణుల దాడి! - వైకాపా నేతపై దాడి

సొంత పార్టీ కార్యకర్తపై వైకాపా శ్రేణుల దాడి
సొంత పార్టీ కార్యకర్తపై వైకాపా శ్రేణుల దాడి

By

Published : Dec 20, 2021, 4:01 PM IST

Updated : Dec 21, 2021, 7:06 AM IST

15:57 December 20

మంత్రిని విమర్శించాడని దాడి

సొంత పార్టీ కార్యకర్తపై వైకాపా శ్రేణుల దాడి

‘మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను..’ అంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం కలిగించింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా సంబంధిత వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ.... మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లపై చేసిన వ్యాఖ్యలతో ఆయనకు బెదిరింపులు అధికమయ్యాయి. ఒంగోలు లంబాడీడొంకలోని ఆయన నివాసంపై శనివారం రాత్రి కొందరు యువకులు దాడి చేశారు. దీంతో సుబ్బారావు గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

సుబ్బారావుపై దాడి..

గుంటూరులోని బస్టాండు సమీపంలోని ఓ లాడ్జిలో తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలినేని అనుచరులు కొందరు ఆదివారం సాయంత్రం 3.40గంటల సమయంలో ఒక పోలీసు వాహనంతో పాటు మరో ప్రైవేటు వాహనంలో ఆ లాడ్జి వద్దకు చేరుకున్నారు. సుభానీ అనే వ్యక్తి సుబ్బారావు గుప్తాపై దాడికి దిగారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పదే పదే దాడి చేశారు. తాను మధుమేహంతో బాధపడుతున్నాననీ, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. తనను వదిలిపెట్టాలని గుప్తా వేడుకున్నా వినిపించుకోకుండా దాడి చేశారు. ‘అన్నా మీ కాళ్లు పట్టుకుంటా.. నేను చిన్నప్పటి నుంచి ఆయనకు సేవ చేశా.. పార్టీలో ఏం జరుగుతుందో చెప్పా.. అన్నా.. అన్నా..నీకు దండం పెడతా.. చెప్పేది విను.. ప్లీజ్‌.. ప్లీజ్‌...’ అని కాళ్లావేళ్లా పడినా సుభానీ వినిపించుకోలేదు. తీవ్ర స్వరంతో దుర్భాషలాడుతూ గుప్తాను కొట్టారు. ‘చంపేస్తా.. ఎవరు చెబితే నువ్వు మాట్లాడావ్‌, రెండు నిమిషాల్లో నిన్ను ఏసేస్తాం’ అంటూ తీవ్రస్వరంతో బెదిరించారు. సుభానీతో పాటు మరో వ్యక్తి గుప్తాను చొక్కా పట్టుకుని మంచం మీద నుంచి కిందకు లాక్కొచ్చి మోకాళ్లమీద కూర్చోబెట్టి దండం పెట్టిస్తూ మంత్రి బాలినేనికి క్షమాపణ చెప్పించారు. మొత్తం ఈ ఉదంతాన్ని చిత్రీకరించారు. ఈ వీడియో సోమవారం బయటకు రావడంతో తీవ్ర కలకలం రేపింది.

మతిస్థిమితం లేదనడం సరికాదు..

సుబ్బారావు గుప్తా విలేకర్లతో మాట్లాడుతూ.. ఒంగోలులో తన నివాసంపై జరిగిన దాడితో ఆందోళనకు గురై గుంటూరులోని పద్మశ్రీ లాడ్జిలో తలదాచుకున్నానన్నారు. ఒక పోలీసు వాహనంతో పాటు మరో వాహనంలో వచ్చిన సుభానీ, అతని బృందం దాడి చేశారన్నారు. తనకు మతిస్థిమితం లేదని భార్య చెప్పినట్లు.. మంత్రి బాలినేని అంటున్నారని, అది సరికాదన్నారు. తానెప్పుడూ పార్టీకి విధేయుడినని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

కేసు నమోదు..

సుబ్బారావు గుప్తా నివాసంపై దాడి, గుంటూరులోని లాడ్జిలో అతనిని కొట్టిన సంఘటనలపై ఒంగోలు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో సోమవారం రాత్రి కేసు నమోదైంది. తొలుత సుబ్బారావు భార్య నాగమణి, పిల్లలను ఒంగోలు ఒకటో పట్టణ సీఐ కె.వి.సుభాషిణి స్టేషన్‌కు తీసుకెళ్లారు. శనివారం రాత్రి ఏం జరిగిందీ, ఆ ఇంటి మీదకు వచ్చి దౌర్జన్యం చేసిన సంఘటనపై ఆరా తీసి పంపించారు. అనంతరం సుబ్బారావు గుప్తా నుంచి ఫిర్యాదు స్వీకరించారు. తాను వైకాపా కార్యకర్తను కావడంతో తన ఇంటిపై జరిగిన దాడి విషయంలో తొలుత ఫిర్యాదు చేయలేదని.. మరోసారి గుంటూరులో తనపై భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు. కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఈ 2 సంఘటనలపై కేసులు నమోదయ్యాయి.

ఆర్యవైశ్య సంఘం ప్రతినిధుల నిరసన

రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ లేకుండాపోతుందని దాడులు, అరాచకాలతో అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రకాశం జిల్లా పర్చూరులో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. సుబ్బారావు గుప్తా నివాసంపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మామిడిపాక హరిప్రసాదరావు తెలిపారు. సుబ్బారావు గుప్తాపై దాడిని ఖండిస్తూ రాత్రి కనిగిరి పట్టణంలో తెదేపా నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీలకతీతంగా అర్యవైశ్యులంతా ఏకం కావాలని రాష్ట్ర అర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు అర్వపల్లి ఆంజనేయులు పిలుపునిచ్చారు.

గుప్తాను కొట్టలేదు..

‘ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తాను నా అనుచరులు కొట్టలేదు. పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలకు బాధపడి దాడి చేసేందుకు వెళ్లారు. ఇది తెలిసి వారికి ఫోన్‌ చేసి ఆపించాను...’ అని విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘గుప్తాకు మతిస్థిమితం సరిగా లేదని, ఇంట్లో కూడా ఏదేదో మాట్లాడుతుంటాడని స్వయంగా ఆయన భార్య ఫోన్‌ చేసి చెప్పింది. ఈ రోజు నన్ను కలుస్తానని చెప్పింది. అలాంటి వ్యక్తి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా అతనితో చెప్పించి ఉండొచ్చు. ఆయన పోస్టర్లు, జెండాలు అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. తెదేపా వారికి కూడా పరిచయం ఉంది. కాకపోతే నాతో ఎక్కువ తిరుగుతుంటాడు...’ అని పేర్కొన్నారు. ఇందులో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ హస్తం ఉందని మీ అనుచరులు ఆరోపిస్తున్నారు అన్న ప్రశ్నకు మంత్రి బాలినేని సమాధానం ఇస్తూ.. గతంలో వాళ్ల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఓ పనికి సంబంధించి టెండరు వేశాడని, తెదేపా నేత అని కూడా చూడకుండా అతని ఇంటిపై దాడి చేసి దామచర్ల పగులగొట్టించారని ఆరోపించారు. తన అనుచరులు ఎవరూ దాడి చేయరని, ఒకవేళ చేస్తే తాను బాధ్యత తీసుకుంటానని వివరించారు.

భువనేశ్వరిపై వ్యాఖ్యలు తప్పే

తెదేపా అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరిపై తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పేనని, దీనిని తాను ఆరోజే ఖండించానని మంత్రి బాలినేని గుర్తు చేశారు. రాజకీయంగా విమర్శించుకోవడం వరకు ఫర్వాలేదు కానీ ఇంట్లో కుటుంబసభ్యుల గురించి వ్యాఖ్యలు చేయడం సంస్కారం కాదన్నారు. ఇది జరిగిన సమయంలో సభలో సీఎం లేరు, ఇటువంటి వాటిని ఆయన ప్రోత్సహించరని చెప్పారు. గతంలో షర్మిల గురించి తెదేపా వారు సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం చేశారని, అది కూడా తప్పేనని, చంద్రబాబు, నాయకులు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.

ఇదీ చదవండి

Attack on YSRCP Leader House: ప్రకాశం జిల్లాలో వైకాపా నేత ఇంటిపై దాడి..

Last Updated : Dec 21, 2021, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details