YSRCP Leader Subba Rao Gupta:ఒంగోలులో చోటారాజన్ గ్యాంగ్, డి గ్యాంగ్‌లు దిగాయని ఇటీవల దాడికి గురైన వైకాపా నేత సుబ్బారావు గుప్తా అన్నారు. విజయవాడ మాకినేని విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఆర్యవైశ్య ఐక్యత సభలో ఆయన పాల్గొన్నారు. తనపై జరిగిన దాడి ఘటనపై సీఐడీ విచారణ జరిపి నిందితులను శిక్షించాలని గుప్తా డిమాండ్ చేశారు. తనపై దాడి చేసినవారు ఇంకా క్షమాపణ చెప్పలేదన్న సుబ్బారావు గుప్తా..వారు క్షమాపణ చెబితేనే సీఎంను కలుస్తానన్నారు. ఒంగోలులోని 300 మంది రౌడీల్లో 200 మంది తనకు తెలుసునని అన్నారు.
"సీఐడీ విచారణ జరిపి నాపై దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలి. నాపై దాడి చేసినవారు ఇంకా క్షమాపణ చెప్పలేదు. దాడి చేసిన వ్యక్తి క్షమాపణ చెబితేనే సీఎంను కలుస్తా. ఒంగోలులో చోటారాజన్ గ్యాంగ్, డి గ్యాంగ్ దిగాయి. ఒంగోలులోని 300 మంది రౌడీల్లో 200 మంది నాకు తెలుసు." -సుబ్బారావు గుప్తా, వైకాపా నేత
ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు..
పార్టీలకతీతంగా ఆర్యవైశ్యులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సభను నిర్వహించామని సభకు హాజరైన అంబికా కృష్ణ, సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. సమస్య వచ్చినప్పుడు రాజకీయ నేతల దగ్గరకు వెళ్లవద్దని సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని మరొకరి కాళ్ల దగ్గర పెట్టొద్దని అన్నారు. రాజకీయాలకు తావివ్వకుండా ఐక్యతతో తమ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాలన్నారు.
గుప్తాపై దాడి ఎందుకు జరిగిందంటే..
గతేడాది డిసెంబరు 12న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తా.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వారు మాట్లాడుతున్న భాష, వ్యవహారశైలి అభ్యంతరకరమని.. ఫలితంగా పార్టీకి 20 శాతం వరకు ఓటింగ్ తగ్గుతుందని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో తెదేపా గెలిస్తే.. వైకాపా కార్యకర్తలను కర్రలతో తరిమి కొడతారని ఆందోళన వ్యక్తం చేశారు.
గుప్తా వ్యాఖ్యలు చేసిన అయిదు రోజుల తర్వాత పూటుగా మద్యం తాగిన 15 మందికి పైగా వ్యక్తులు లంబాడీడొంకలోని సుబ్బారావు గుప్తా నివాసానికి రాత్రి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. అయినప్పటికీ అతన్ని దుర్భాషలాడుతూ ఇంట్లోకి ప్రవేశించి బెదిరింపులకు దిగారు. అంతుచూస్తామని హెచ్చరిస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. వారిని సుబ్బారావు గుప్తా భార్య ప్రతిఘటించటంతో అక్కడి నుంచి బయటికి వచ్చారు. సుబ్బారావు ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం నుంచి సుబ్బారావు గుప్తా అదృశ్యమయ్యారు. అతని సెల్‌ఫోన్ స్విచాఫ్ అయింది.