Balineni Srinivasa Reddy Crying In Press Meet : పార్టీకి కట్టుబడి ఉండడాన్ని కొంతమంది అలుసుగా తీసుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్సీపీ కోసం ఎంతో కష్టపడ్డానని, పార్టీ కార్యకర్తల కోసం ఏదైనా చేస్తానన్నారు. ఎవరిపైనా సీఎంకు ఫిర్యాదు చేయలేదన్న బాలినేని... అలాంటి మనస్తత్వం తనది కాదన్నారు. తాను టికెట్ ఇప్పించిన వారే అధిష్ఠానానికి తనపై ఫిర్యాదు చేస్తున్నారని... వారి మాదిరిగా పార్టీకి నష్టం చేయలేదని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వివాదాలకు అధిష్ఠానమే ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నానన్న బాలినేని... నియోజకవర్గంపై దృష్టి సారించేందుకే ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశానన్నారు.
వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉండి పార్టీని బలోపేతం చేయడంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకపాత్ర పోషించారు. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీపై పూర్తి పట్టు చూపిన బాలినేనికి ఇప్పుడు జిల్లాలో ఎలాంటి గుర్తింపు లేకపోవడం మాజీ మంత్రిని స్థిమితం లేకుండా చేస్తోంది. తొలుత ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న బాలినేనిని ఆ పదవి నుంచి తప్పించి, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల బాధ్యతలు అప్పగించారు.
"ఎమ్మెల్యేల చేత సీఎంకు ఫిర్యాదు చేయిస్తారు. నేను నియోజకవర్గాల్లో కలుగజేసుకుంటున్నానని ఫిర్యాదు చేయిస్తున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి. పార్టీ కోసం ఎంత శ్రమించానో, ఎంత బాధ పడ్డానో నాకు తెలుసు. నా మీద, నా కొడుకు మీద ఆరోపణలు చేసేవాళ్లు తప్పు చేశామని చూపించండి."- బాలినేని శ్రీనివాస రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
సీఎం మార్కాపురం పర్యటనలో హెలీప్యాడ్ వద్దకు బాలినేని కారును అనుమతించకపోవడం, డీఎస్పీ బదిలీల్లో తన మాట చెల్లకపోవడం వంటి పరిణామాలు.. బాలినేనికి మింగుడుపడకుండా చేశాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుత పరిస్థితి వెనుక ప్రకాశం జిల్లాకే చెందిన కొందరు నేతలు, ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు ఆయన అనుకూల వర్గం ఆరోపిస్తోంది.