YSRCP Government Failed :ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానందంటా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచటం చేతకాని రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష 2.O (Jagananna Arogya Suraksha 2.O) పేరిట ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు ప్రచారానికే పనికొస్తున్నాయి. గ్రామాల్లో మంగళవారం, పట్టణాల్లో బుధ వారం నుంచి శిబిరాలు ప్రారంభించారు. అక్కడక్కడ స్పెషలిస్టు వైద్యులు వచ్చినా, రోగులకు సాధారణ వైద్య సేవలే అందించారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందే అరకొర వైద్యమే ఇక్కడా లభించింది. జగనన్న బొమ్మతో ఉన్న బ్యాగుల్లో మందులు పెట్టి రోగులకు ఇచ్చారు. పట్టణాల్లో 300, గ్రామాల్లో 400 నుంచి 500 వందల మంది రోగులు ఈ శిబిరాలకు వచ్చేలా వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. అయినా వైద్య శిబిరాలు వెలవెలబోయాయి.
ప్రచారానికే పరితమైన జగనన్న ఆరోగ్య సురక్ష 2.O
People Reject Jagananna Arogya Suraksha Scheme :శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రాలు మొక్కుబడి ఏర్పాటు చేశారు. పురుషోత్తపురం పురపాలక ఉన్నత పాఠశాలలో ఆర్భాటంగా ప్రారంభించినా ప్రత్యేక వైద్యులను నియమించలేదు. ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు మాత్రమే వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూ రులో మోకాళ్ల నొప్పులు, చర్మ వ్యాధుల చికిత్సకు రోగులు రాగా అందుకు సంబంధించిన వైద్యులు లేరు. విజయవాడలోని రామలింగేశ్వరనగర్ లో ఏర్పాటు చేసిన శిబిరానికి పెద్దగా రోగులు రాలేదు. న్యూ వాంబే కాలనీలో వైద్యుల కోసం రోగులు పడిగాపులు కాయాల్సి వచ్చింది.