Aqua sector farmers fire on YSRCP government: ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని ఎన్నికల ముందు రొయ్యల చెరువుల దగ్గరకెళ్లి బీరాలు పలికిన జగన్.. అధికారంలోకి వచ్చాక రైతుల గోడు పట్టించుకోవడం లేదు. ధరలు పడిపోయి, పెట్టుబడులు పెరిగి.. గతేడాది రైతులు నిలువెల్లా మునిగినా.. జగన్ సర్కారు మాత్రం చేయూత అందించలేదు. పైగా వారికి యూనిట్ రూపాయిన్నర చొప్పున ఇస్తామన్న రాయితీ విద్యుత్తుకూ కోత పెట్టారు. ఆర్థిక భారం పేరుతో ఆక్వా జోన్లను.. అయిదెకరాలు, పదెకరాల వరకే వర్తింపజేస్తామని ఆటలాడారు. మూలుగుతున్న రైతులపైనే ఏడాదిపాటు విద్యుత్తు భారం వేశారు.
ఆక్వా రైతులకు మేలు చేస్తా.. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక.. ఆక్వా రైతులకు తాను మేలు చేస్తానంటూ చెప్పుకొచ్చి.. రాయితీ విద్యుత్తు హామీని 2021-22 వరకే అమలు చేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి మడమ తిప్పేశారు. రాష్ట్రంలో 2016కు ముందు స్లాట్లకు అనుగుణంగా విద్యుత్తు టారిఫ్ యూనిట్‌కు 4 రూపాయల 63 పైసల నుంచి 7 రూపాయల వరకు ఉండేది. ఆక్వా రంగానికి ప్రోత్సాహంలో భాగంగా అప్పటి ప్రభుత్వం 2016 నుంచి 2018 మే వరకు యూనిట్‌కు 3 రూపాయల 86 పైసల చొప్పున ధర వసూలు చేసింది. 2019లో రొయ్యల ధరలు పతనమవడంతో.. రైతుల విజ్ఞప్తి మేరకు యూనిట్ విద్యుత్తును 2 రూపాయలకే ఇచ్చి, వారికి ఆర్థికంగా భరోసా కల్పించింది. ఆ తర్వాత ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును రూపాయన్నర చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో రూ.2 వేల 378 కోట్లు రాయితీగా ఇచ్చారు. అయితే, 2022-23లో అందరికీ ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు. నష్టాలతో సతమతమవుతున్న రైతు ఈ దెబ్బతో మరింత కుదేలయ్యాడు.
మొదట 5 ఎకరాలు-తర్వాత 10 ఎకరాలు.. తొలుత జోన్ పరిధిలో అయిదెకరాల్లోపు చెరువులకే రాయితీ విద్యుత్తు ఇస్తామని మెలిక పెట్టారు. రైతుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. తర్వాత పదెకరాల వరకు చెరువులకు అమలు చేస్తామన్నారు. ఏడాది తర్వాత ఈ-ఫిష్ సర్వే పేరుతో అర్హుల సంఖ్యను 61 వేల 682 మంది నుంచి 46 వేల 445 మందికి కుదించారు. రాయితీపై విద్యుత్తు మొత్తాన్ని కూడా రూ.957 కోట్ల రూపాయల నుంచి 673 కోట్లకు తగ్గించారు. రైతులకు ఇచ్చే సొమ్ములో ఏడాదికి 284 కోట్లను ఆదా చేసుకునేందుకు.. గతంలో రాయితీ విద్యుత్తు అందుకుంటున్న వారిలో 24 శాతం మందికి మొండిచేయి చూపారు. వీరిలో 7 శాతం మంది చిన్న రైతులే ఉన్నా.. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా అర్హత సాధించలేకపోయారు. సర్వే సమయంలో ఏడాది పాటు రాయితీ విద్యుత్తు నిలిపేసి, లక్షల రూపాయల్లో బిల్లులు వడ్డించారు. విద్యుత్తు రాయితీకి అర్హులైన రైతుల సంఖ్యకు కత్తెర వేసి, రాయితీ మొత్తాన్ని కుదించి, ప్రభుత్వంపై భారం తగ్గించుకున్నారు.